Indian Wells 2024: తప్పుకున్న నాదల్.. భారత టెన్నిస్ స్టార్‌కు మరో అవకాశం

Indian Wells 2024: తప్పుకున్న నాదల్.. భారత టెన్నిస్ స్టార్‌కు మరో అవకాశం

గాయాల కారణంగా చివరి నిమిషంలో స్పానిష్ స్టార్ రఫెల్ నాదల్ వైదొలగడంతో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ 'లక్కీ లూజర్'గా బిఎన్‌పి పరిబాస్ ఓపెన్‌లో మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. అంతకుముందు నాగల్ ఇండియన్ వెల్స్ 2024 టోర్నీ క్వాలిఫైయింగ్ రెండో రౌండ్‌లోనే ఓడిపోయాడు. దక్షిణ కొరియాకు చెందిన హాంగ్ సియోంగ్ చాన్ చేతిలో 6-2, 2-6, 6-7 తేడాతో పరాజయం పాలయ్యాడు. అయినప్పటికీ.. ఏటీపీ  ర్యాంకింగ్స్‌(101) ఆధారంగా మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. 2016 వింబుల్డన్ ఫైనలిస్ట్ కెనడాకు చెందిన మిలోస్ రావోనిక్‌తో సుమిత్ నాగల్ తలపడనున్నాడు.

సోషల్ మీడియా వేదికగా ప్రకటన

అంతకుముందు, 37 ఏళ్ల నాదల్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. "ఇండియన్ వెల్స్‌లో ఆడటం నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. నేను ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ఈ ఈవెంట్‌లో అత్యున్నత స్థాయిలో ఆడేందుకు నేను సిద్ధంగా లేను. 

ALSO READ :- IND vs ENG: స్పిన్నర్ల తడాఖా.. తక్కువ స్కోర్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్

ఈ అద్భుతమైన టోర్నీ నుండి వైదొలగుతున్నందుకు నాకూ బాధగా ఉంది. కానీ మీకు నేను అబద్ధం చెప్పలేను. వేలాది మంది అభిమానులను మోసంచేయలేను. మీ అందరినీ మిస్ అవుతున్నా. టోర్నమెంట్ గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా.." అని నాదల్ చెప్పుకొచ్చాడు.