ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో యాంటిమ్ పంఘల్కు స్వర్ణం

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో యాంటిమ్ పంఘల్కు స్వర్ణం

అండర్–20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళా రెజ్లర్‌ యాంటిమ్ పంఘల్ స్వర్ణం సాధించింది. బల్గేరియా సోఫియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో  53 కేజీల విభాగంలో యాంటిమ్ పంఘల్ పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో యాంటిమ్ 11-0తో జర్మన్ రెజ్లర్‌ను ఓడించగా.. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ రెజ్లర్పై అద్భుత విజయం సాధించింది. సెమీఫైనల్‌లో ఉక్రేనియన్ గ్రాప్లర్‌ను సులభంగా ఓడించిన ఆమె..ఫైనల్లో కజకిస్తాన్ రెజ్లర్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. యాంటిమ్ గతంలో క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2021లో కాంస్యం పతకం సాధించింది. ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్ 2022లో స్వర్ణం సాధించింది. ఈ ఏడాది U23 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం కూడా దక్కించుకుంది. 

భారత జట్టుకు సిల్వర్..
ఈ టోర్నీలో ఇద్దరు భారత గ్రాప్లర్లు తమ చివరి బౌట్‌లలో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 62 కిలోలో విభాగంలో సోనమ్.. 65 కిలోల విభాగంలో ప్రియాంక సిల్వర్ మెడల్స్ సాధించారు. ఇక 57కిలోల విభాగంలో  సిటో, 72 కిలోల విభాగంలో- రీతికా  కాంస్యాలను దక్కించుకున్నారు. ఈ విజయంతో భారత జూనియర్ మహిళల జట్టు 160 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 230 పాయింట్లతో జపాన్ అగ్రస్థానంలో నిలవగా.., 124 పాయింట్లతో అమెరికా మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

అమిత్ షా అభినందనలు..
U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 53 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన యాంటీమ్ పంఘల్‌ను అమిత్ షా అభినందించారు. U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా చరిత్ర సృష్టించినందుకు యాంటిమ్‌ను సోషల్ మీడియాలో ప్రశంసించారు. "గర్వించదగిన క్షణం. చరిత్ర సృష్టించినందుకు .. U-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ రెజ్లర్ గా నిలిచినందుకు యాంటిమ్ పంఘల్‌కు అభినందనలు. భారతదేశం మీ కృషి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తుంది. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు, ప్రకాశిస్తూ ఉండండి" అని షా అని ట్వీట్ చేశారు.