
నేపాలీలను పెళ్లి చేసుకునే భారత మహిళలకు ఆ దేశ పౌరసత్వం ఇచ్చే విషయంలో నేపాల్ ప్రభుత్వం మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన యువతులు ఎవరైనా నేపాల్ పౌరుడిని పెళ్లాడితే ఏడేళ్ల తర్వాత మాత్రమే ఆమెకు నేపాల్ పారసత్వం వస్తుందని ఆ దేశ హోం మంత్రి రామ్ బహదూర్ తపా ప్రకటించారు. గతంలో ఇటువంటి షరతులు లేకుండా నేపాలీలను పెళ్లాడిన భారత యువతులకు వెంటనే పౌరసత్వం ఇచ్చేది. అయితే ఇటీవల భారత్‌కు చెందిన కాలాపానీ, లిపూలేఖ్, లింపియాదురా ప్రాంతాలను నేపాల్ భూభాగాలుగా చూపిస్తూ మ్యాప్‌లను ప్రచురించి, వాటిపై రాజ్యాంగ సవరణలను సైతం చేసిన నేపాల్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఈ క్రమంలో ఇప్పుడు నేపాల్ పౌరసత్వం విషయంలో షరతులు పెడుతూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కొత్త నిబంధనపై శనివారం ప్రకటన చేసిన నేపాల్ హోం మంత్రి రామ్ బహదూర్.. భారత్‌లోనూ ఇటువంటి షరతులే ఉన్నాయని చెప్పుకొచ్చారు. విదేశీ మహిళలు భారతీయుడిని పెళ్లి చేసుకుంటే పౌరసత్వం కోసం ఏడేళ్లు వెయిట్ చేయాలని అన్నారు. అయితే ఈ కండిషన్ నేపాల్‌కు వర్తించదన్న విషయాన్ని మాత్రమ ఆయన విస్మరించారు.