కామన్వెల్త్ గేమ్స్: పాక్ను చిత్తు చేసిన టీమిండియా

కామన్వెల్త్ గేమ్స్: పాక్ను చిత్తు చేసిన టీమిండియా

కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. దాయాది పాక్పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 100 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టు..11.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మందానా హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించింది. మరో ఓపెనర్ షఫాలీ శర్మ 16 పరుగులతో పర్వాలేదనిపించింది. పాక్ బౌలర్లలో తుబా హసన్ ఒక వికెట్ పడగొట్టింది. 


వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో  పాకిస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభంలోనే పాక్ పరుగులేమి చేయకుండానే వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ ఇరామ్ జావెద్ ను మేఘనా సింగ్ పెవిలియన్ కు చేర్చింది. ఈ దశలో మరో ఓపెనర్ మునీబా అలీ, బిస్మా మరూఫ్ జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా మునీబా 32 పరుగులు చేసి కొద్దిసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసింది. అయితే ఈ సమయంలో స్నేహ రానా జట్టుకు మరో వికెట్ను అందించింది. ప్రమాదకరంగా మారుతున్న మునీబాను ఔట్ చేసింది. ఆ తర్వాత పాక్ వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరకు 18 ఓవర్లలో పాకిస్థాన్ 99 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, స్నేమ రానా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షఫాలీ శర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు.