- సెకెండ్ హ్యాండ్ కార్ల హవా.. ఫస్ట్ టైమ్ బయ్యర్లలో 65% మంది వీటికే ఓటు
- వేగంగా విస్తరిస్తున్న యూజ్డ్ కార్ మార్కెట్
- 2031 నాటికి ఏడాదికి కోటి బండ్లు అమ్ముడవుతాయని రెడ్‌సీర్ అంచనా
- వినియోగదారుల ఆలోచనల్లో మార్పు
- డైరెక్ట్‌గా యూజ్డ్ ఎస్‌యూవీలు, బ్రాండెడ్ కార్లను కొనే చాన్స్
- ధర కొత్త కార్ల కంటే 57 శాతం తక్కువ
న్యూఢిల్లీ: ఇండియా కారు మార్కెట్‌లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు కొత్త కారును స్టేటస్ సింబల్‌గా చూసేవారు. ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ బండైనా పర్వలేదు కానీ ఎస్‌యూవీ లేదా టాప్ బ్రాండ్ అయితే చాలు అనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా యూజ్డ్ కార్ మార్కెట్ దూసుకుపోతోంది.
గతంలో భారతీయులు మొదట ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును కొని, కొన్ని సంవత్సరాల తర్వాత నెమ్మదిగా పెద్ద కారుకు అప్‌గ్రేడ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతి మారుతోంది. దీంతో సెకెండ్ కార్ల అమ్మకాలు దూసుకుపోతున్నాయి. కన్సల్టెన్సీ కంపెనీ రెడ్‌సీర్ రిపోర్ట్ ప్రకారం, యూజ్డ్ కార్లను కొంటున్న వారిలో దాదాపు 65శాతం మంది మొదటిసారి కారు కొనుగోలు చేస్తున్నవారే. వీరు దీనిని కేవలం ఒక లావాదేవీలా కాకుండా, తమ జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా భావిస్తున్నారు.
రికార్డు స్థాయికి మార్కెట్ విలువ
రెడ్‌సీర్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో యూజ్డ్ కార్ల మార్కెట్ 2030–31నాటికి దాదాపు 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.72 లక్షల కోట్ల) కు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏటా 60 లక్షల సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జరుగుతుండగా, ఇంకో ఐదేళ్లలో ఈ నెంబర్ ఏకంగా 90 లక్షల నుంచి కోటికి చేరొచ్చని అంచనా. వినియోగదారులకు సులువుగా ఫైనాన్సింగ్ అందుతుండడం, నమ్మకం పెరుగుతుండడంతో అమ్మకాలు దూసుకుపోతున్నాయి. కొన్ని ఇబ్బందులు తొలగితే యూజ్డ్ వెహికల్స్ మార్కెట్ ఏడాదికి 15–20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా.
ఎస్‌యూవీల హవా
యూజ్డ్ కార్ల అమ్మకాలలో యుటిలిటీ వాహనాల (యూవీలు/ఎస్‌యూవీల) వాటా 2020–21 లో 12–-16శాతం ఉండగా, అది 2030–31 నాటికి 19–-22 శాతానికి పెరుగుతుందని రెడ్‌సీర్ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం 1 నుంచి 3 ఏళ్ల వయసున్న మంచి కండిషన్ గల ప్రీమియం కార్లు మార్కెట్లోకి రీసేల్ కోసం వేగంగా వస్తున్నాయి. మంచి బండ్లు అందుబాటులో ఉండడంతో చాలా మంది వినియోగదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త కార్లతో పోలిస్తే వీటి ధరలు దాదాపు 57శాతం వరకు తక్కువగా ఉండడం కూడా ఆకర్షిస్తోంది. కారుపై పెట్టే ఖర్చును తగ్గించుకుని, మిగిలిన డబ్బును పెట్టుబడులు, పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాలకు వాడుకోవచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నారు.
ఇబ్బందులూ ఉన్నాయ్..
యూజ్డ్ కార్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ , ఈ సెక్టార్‌లో అమ్మకాలు సగానికి పైగా (దాదాపు 50శాతం) అన్‌ఆర్గనైజ్డ్ (స్థానిక బ్రోకర్లు/డీలర్లు) ద్వారానే సాగుతోంది. దేశంలో దాదాపు 47 వేల నుంచి 52 వేల వరకు అన్‌ఆర్గనైజ్డ్ డీలర్లు ఉంటే, బ్రాండెడ్ డీలర్లు కేవలం 2,500 నుంచి మూడు వేల మంది మాత్రమే ఉన్నారు. అన్‌ఆర్గనైజ్డ్ డీలర్లలో పారదర్శకత లేకపోవడం, నకిలీ హిస్టరీ, ఆర్సీ బదిలీల్లో ఆలస్యం వంటి సమస్యల వల్ల కస్టమర్ల నమ్మకం తగ్గిపోతోంది.
