- 15 నెలల్లో చూసింది 6.10 లక్షల కోట్ల నిమిషాలు
వెలుగు బిజినెస్ డెస్క్: మన దేశంలోని ప్రజలు ఆన్లైన్ వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు. జనవరి 2022 నుంచి మార్చి 2023 మధ్య కాలంలో అంటే 15 నెలల్లో ఏకంగా 6.1 ట్రిలియన్ మినిట్స్ పాటు ఆన్లైన్ వీడియోలను చూశారట. ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో 88 శాతం వాటాతో యూట్యూబ్ లీడర్షిప్ పొజిషన్లో నిలుస్తోంది. మరోవైపు ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (వీఓడీ) కేటగిరీ కూడా తన వ్యూయర్షిప్ వాటాను ఇదే 15 నెలల కాలంలో 12 శాతానికి పెంచుకుంది. మీడియా పార్ట్నర్స్ ఏషియా (ఎంపీఏ) ఈ ఆసక్తికరమైన వివరాలతో ఒక రిపోర్టును రిలీజ్ చేసింది. కన్జూమర్ ఇన్సైట్స్ తెలుసుకోవడానికి, మెజర్ చేయడానికి ఎంపీఏ డేటాను సమీకరిస్తోంది.
యూట్యూబే రారాజు..
ఆన్లైన్ వీడియో కన్జంప్షన్లో యూట్యూబ్ రారాజుగా నిలుస్తోందని, 88 శాతం వాటా దక్కించుకుందని ఎంపీఏ రిపోర్టు తెలిపింది. ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ కేటగిరీ కూడా దేశంలో ఆదరణ పెంచుకుంటోందని, ఈ కేటగిరీ 15 నెలల కాలంలో తన వ్యూయర్షిప్ వాటాను 12 శాతానికి పెంచుకుందని పేర్కొంది. 2021 లో ఈ కేటగిరీ వాటా 10 శాతమేనని వివరించింది. ఇండియా ఆన్లైన్ వీడియో రిపోర్టు పేరుతో కన్జంప్షన్, కంటెంట్, ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తే తన రిపోర్టును ఎంపీఏ తెచ్చింది. స్పోర్ట్స్, హిందీ, రీజినల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆఫరింగ్స్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ కేటగిరీలో 38 శాతం వాటాతో దూసుకెళ్తున్నట్లు ఎంపీఏ రిపోర్టు వెల్లడించింది.
జియో సినిమాకు ఐపీఎల్ బూస్ట్..
జీ–సోనీ గ్రూప్‌లకు కలిపి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ కేటగిరీలో 13 శాతం వాటా ఉంది. మరో ఏడాదిపాటు ఈ రెండు గ్రూప్‌ల ప్లాట్‌ఫామ్స్ విడివిడిగానే పనిచేయనున్నాయని రిపోర్టు పేర్కొంది. తమ స్ట్రాంగ్ కంటెంట్‌తో వ్యూయర్స్‌ను ఇవి ఆకట్టుకోగలుగుతున్నాయని వివరించింది. మార్చి 2023 దాకా గల 15 నెలలకు చూస్తే జియో సినిమాకి వీడియో ఆన్ డిమాండ్ కేటగిరీలో 2 శాతం మార్కెట్ వాటా ఉందని, కానీ ఆ తర్వాత ఐపీఎల్ లాంఛ్‌తో ఒక్కసారిగా ఈ ప్లాట్‌ఫామ్‌పై కన్జంప్షన్ ఏప్రిల్ నెలలో 20 రెట్లు పెరిగిందని ఎంపీఏ రిపోర్టు తెలిపింది.
ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు 10 శాతం వాటా....
అమెజాన్ ప్రైమ్వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లకు కలిపి ప్రీమియం వీడియో ఆన్‌డిమాండ్ కేటగిరీలో 10 శాతం వాటా ఉందని, వివిధ లాంగ్వేజెస్‌లో కంటెంట్‌తో పాటు, క్రైమ్, థ్రిల్లర్స్, యాక్షన్, ఎడ్వెంచర్ కంటెంట్‌తో ప్రైమ్ వ్యూయర్స్‌ను ఆకర్షిస్తోందని రిపోర్టు తెలిపింది. లోకల్ కంటెంట్ వల్లే ప్రైమ్ వీడియోకి 60 శాతం వ్యూయర్షిప్ వస్తున్నట్లు పేర్కొంది. ఇంకోవైపు, నెట్‌ఫ్లిక్స్ ఇండియా వ్యూయర్షిప్లో 25 శాతం లోకల్ కంటెంట్ నుంచి వస్తోందని వివరించింది. ఈ ప్లాట్‌ఫామ్ తెచ్చిన ఇండియన్ ఒరిజినల్స్ దీర్ఘకాలం పాటు నిలబడలేకపోతున్నాయని ఎంపీఏ రిపోర్టు పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ చేతిలోని యూఎస్ టైటిల్స్ మాత్రం నిలకడగా వ్యూయర్షిప్ను నిలబెట్టుకోగలుగుతున్నాయని వివరించింది.
ఇండియన్ కంటెంటే లీడర్..
స్పోర్ట్స్‌ను మినహాయిస్తే, ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ వ్యూయర్షిప్లో ఇండియన్ కంటెంటే లీడర్‌గా నిలుస్తున్నట్లు తెలిపింది. పెయిడ్ కంటెంట్ చూసే వారిలో ఎక్కువ మంది ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టపడుతున్నారని, పెయిడ్ కేటగిరీలో ఈ సెగ్మెంట్‌కు 51 శాతం వాటా ఉందని పేర్కొంది. రాబోయే 6 నుంచి 12 నెలలు ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌కి చాలా ముఖ్యమైన కాలం. ఈ టైములో ఒక వైపు మానిటైజేషన్, ప్రాఫిటబి లిటీ సాధిస్తూనే, కంటెంట్‌లోనూ పెట్టుబడు లను ఓటీటీలు పెంచుకోవాల్సి ఉంటుంది.
- మిహిర్ షా, వైస్ ప్రెసిడెంట్ , ఎంపీఏ
