కరోనా ఎఫెక్ట్ : ఆడ ఉండలేరు.. ఇటు రాలేరు

కరోనా ఎఫెక్ట్ : ఆడ ఉండలేరు.. ఇటు రాలేరు

వాషింగ్టన్‌‌: న్యూజెర్సీలో ఉండే పాండే కపుల్‌‌ జాబ్‌‌ కోల్పోయారు. అమెరికా రూల్స్‌‌ ప్రకారం 60 రోజుల్లో జాబ్‌‌ రాకుంటే ఇండియా వచ్చేయాలి. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడాది వయసు. ఇంకొకరికి ఆరేళ్లు. సోమవారం ఎయిర్‌‌పోర్టుకు వచ్చి ‘వందే భారత్‌‌’ విమానం ఎక్కబోయారు. కానీ సిబ్బంది పిల్లల్ని ఎక్కనివ్వలేదు. తల్లిదండ్రులకే అవకాశం ఉందని, పిల్లలు ఓసీఐ కార్డు పరిధిలోకి వస్తారని, వాళ్లకు అనుమతి లేదని చెప్పారు. దీంతో వాళ్లు వెనక్కి రావాల్సి వచ్చింది.

ఓ సింగిల్‌‌ మదర్‌‌ ఇండియా రావడానికి తన మూడు నెలల బాబుతో రెడీ అయింది. అయితే ఎయిర్‌‌లైన్స్‌‌ సిబ్బంది తనకు మాత్రమే టికెట్‌‌ ఇచ్చారు. బాబుకు ఇవ్వలేమన్నారు. బాబు అమెరికన్‌‌ సిటిజన్‌‌ అని, అనుమతి లేదని చెప్పారు. దీంతో తనూ వెనక్కి వచ్చేసింది. తనకు అమెరికాలో బంధువులెవరూ లేరు. ఒంటరిగా ఉంటోంది.

వీళ్లే కాదు. అమెరికాలోని చాలా మంది ఇండియన్లకు ఇదే కష్టమొచ్చిపడింది. ఓవర్సీస్‌‌ సిటిజన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఓసీఐ) వీసాలపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త ఆంక్షల వల్ల ఇండియా రాలేని పరిస్థితి నెలకొంది. పిల్లలకు ఓసీఐ వీసా ఉండటం, తల్లిదండ్రులకు ఇండియన్‌‌ వీసా ఉండటంతో జాబ్‌‌ పోయి అక్కడ ఉండలేక, పిల్లల్లేకుండా ఇటు రాలేక సతమతమవుతున్నారు.

పిల్లల్లేకుండా ఎట్లొస్తం?

కరోనా ఎఫెక్ట్‌‌తో అమెరికాలో దాదాపు మూడున్నర కోట్ల మంది జాబ్స్ కోల్పోయారు. ఇందులో హెచ్‌‌1బీ వీసా ఉన్న ఇండియన్లూ ఉన్నారు. వీళ్లంతా 60 రోజుల్లో మళ్లీ జాబ్‌‌లో చేరకపోతే ఇండియాకు తిరిగి రావాల్సిందే. ఈ కరోనా టైమ్‌‌లో జాబ్‌‌ పొందడం చాలా కష్టమైన పని. అందుకే చాలా మంది ఇండియాకు వచ్చేద్దామని అనుకుంటున్నారు. కానీ సర్కారు ఆంక్షలతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. పిల్లలకు ఇండియా రావడానికి అవకాశం లేనప్పుడు తామెలా వస్తామంటున్నారు. ఇండియా గవర్నమెంట్‌‌ ఆంక్షలు తొలగించి ఆదుకోవాలని కోరుతున్నారు. అమెరికాలో ఉండే గడువును 60 నుంచి 180 రోజులకు పొడిగించాలని ప్రెసిడెంట్‌‌ ట్రంప్‌‌ను గత నెలలలో చాలా మంది హెచ్‌‌1బీ వీసా హోల్డర్లు కోరారు.

పేరెంట్స్‌‌ ఉండి.. పిల్లలకు లేక..

కరోనాను అరికట్టేందుకు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫారిన్‌‌ , ఓసీఐ కార్డు వీసాలపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో అమెరికాలో ఉన్న ఇండియన్లకు చిక్కొచ్చిపడింది. వీసా, గ్రీన్‌‌కార్డు ఉన్న వారి పిల్లలు అక్కడే పుడితే వాళ్లు ఓసీఐ పరిధిలోకి వస్తారు. ఇండియా రూల్స్‌‌ ప్రకారం ఇండియన్‌‌ వీసా ఉంటేనే వందే భారత్‌‌ ఫ్లైట్లు ఎక్కడానికి అనుమతి ఉంది. ఓసీ కార్డు హోల్డర్స్‌‌కు లేదు. దీంతో పేరెంట్స్‌‌ ఇండియాకు రావడానికి అనుమతి ఉండటం, పిల్లలకు చాన్స్‌‌ లేకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.

కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ తేల్చేందుకు సీరమ్ సర్వే