అమెరికా ఎన్నికల్లో మనోళ్లు గెలిచిన్రు

అమెరికా ఎన్నికల్లో మనోళ్లు గెలిచిన్రు

అంతా డెమొక్రాట్​ పార్టీ తరఫున బరిలోకి

న్యూయార్క్​ అసెంబ్లీకి ఎన్నికైన జెన్నిఫర్​ రాజ్​కుమార్​

తొలి దక్షిణాసియా మహిళగా రికార్డ్​

ఎగువ సభ (సెనేట్​) బరిలో ఓడిన రిక్​ మెహతా

రిపబ్లికన్​ తరఫున న్యూజెర్సీ నుంచి పోటీ

వాషింగ్టన్​: అమెరికా ఎన్నికల్లో మనోళ్లకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ దేశ దిగువ సభ (లోయర్​ హౌస్​) అయిన హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు నలుగురు ఇండియన్​ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. మొదటి సారి బరిలో నిలిచినోళ్లు కొందరు ఓడిపోయారు. ఎక్కువగా డెమొక్రాట్​ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నేతలు చేసిన ‘సమోసా కాకస్​’ ప్రచారం బాగానే పనిచేసింది. డాక్టర్​ ఎమీ బేరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెన్నిఫర్​ రాజ్​కుమార్​లు మంచి మెజారిటీతో విజయం సాధించారు. మరొక ఇండియన్​ డాక్టర్​ హిరాల్​ తిపిర్నేని లీడింగ్​లో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండియన్ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఇండియన్​ అమెరికన్​ ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా మారారు.

లిబర్టేరియన్​ పార్టీకి చెందిన ప్రెస్టన్​ నెల్సన్​ (30)ను రాజా కృష్ణమూర్తి ఓడించారు. 47 ఏళ్ల ఆయనకు 71 శాతం ఓట్లు పోలయ్యాయి.

రో ఖన్నా (44).. రిపబ్లికన్​ పార్టీ తరఫున పోటీ చేసిన మరో ఇండియన్​ రితేశ్​ టాండన్​(48)ను ఓడించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. మొత్తం 50 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి.

సమోసా కాకస్​లో చాలా సీనియర్​ మెంబర్​ అయిన డాక్టర్​ ఎమీ బేరా (55).. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి విజయం సాధించారు. రిపబ్లికన్​ పార్టీకి చెందిన 65 ఏళ్ల బజ్​ ప్యాటర్​సన్​ను 25 శాతం ఓట్ల తేడాతో ఆయన మట్టి కరిపించారు.

2016లో గెలిచిన ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు. హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు గెలిచి చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్​ అమెరికన్​ ఆమె. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

రిపబ్లికన్​ పార్టీ తరఫున బరిలో నిలిచిన డేవిడ్​ ష్వూకెర్ట్​పై డెమొక్రాట్​ అభ్యర్థి హిరల్​ తిపర్నేని లీడింగ్​లో ఉన్నారు. అరిజోనా ఆరో కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఆమె గెలిస్తే హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు ఎన్నికైన రెండో ఇండియన్​ మహిళగా నిలుస్తారు.

న్యూయార్క్​ అసెంబ్లీకి ఫస్ట్​ దక్షిణాసియా మహిళ

న్యూయార్క్​ స్టేట్​ అసెంబ్లీకి జెన్నిఫర్​ రాజ్​కుమార్​ అనే లాయర్​ ఎన్నికయ్యారు. న్యూయార్క్​ స్టేట్​ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డ్​ సృష్టించారు. డెమొక్రాట్​ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. రిపబ్లికన్​ అభ్యర్థి జియోవనీ పెర్నాను ఓడించారు. 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్​ నుంచి ఆమె పోటీ చేశారు. న్యూయార్క్​ సిటీకి ఆమె అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారు. అంతకుముందు న్యూయార్క్​ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. లీగల్​ అడ్వైజరీ కౌన్సిల్​ ఆఫ్​ శాంక్చువరీ ఫర్​ ఫ్యామిలీస్​లో లీగల్​ ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. గృహ హింస, సెక్స్​ ట్రాఫికింగ్​, జెండర్​ వయొలెన్స్​ బాధితులకు అండగా నిలుస్తూ.. వారి తరఫున పోరాడుతున్నారు. ఆమె పనితీరు నచ్చి న్యూయార్క్​ రాష్ట్రానికి ఇమిగ్రేషన్​ అఫైర్స్​ అండ్​ స్పెషల్​ కౌన్సెల్​కు డైరెక్టర్​గా నియమించారు గవర్నర్​ ఆండ్రూ క్యువోమో.

ఓటమి తప్పలె

కొన్ని చోట్ల డెమొక్రాట్​, రిపబ్లికన్​ పార్టీల తరఫున పోటీ చేసిన మనోళ్లకు ఓటమి తప్పలేదు. డెమొక్రాట్​ పార్టీకి చెందిన ప్రెస్టన్​ కులకర్ణి (42).. రిపబ్లికన్​ క్యాండిడేట్​ ట్రాయ్​ నెల్స్​ (52) చేతిలో ఓడిపోయారు. టెక్సస్​లోని 22వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి ఆయన పోటీ చేశారు. కులకర్ణికి లక్షా 75 వేల 738 (44%) ఓట్లు రాగా.. నెల్స్​కు 2 లక్షల 4 వేల 537 (52%) ఓట్లు వచ్చాయి. మాజీ డిప్లొమాట్​ అయిన కులకర్ణి.. ఇరాక్​, రష్యా, ఇజ్రాయెల్​, తైవాన్​లో సేవలందించారు.

రిపబ్లికన్​ నుంచి బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల.. డెమొక్రాట్​ అభ్యర్థి జెర్రీ కానలీ చేతిలో ఓడిపోయారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి పోటీ చేశారు.

మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగిన నిషా శర్మ 50 శాతానికిపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆమెను డెమొక్రాట్​ క్యాండిడేట్​ మార్క్​ డిశాల్నియర్​ ఓడించారు.

న్యూ జెర్సీ సెనేట్​ (ఎగువ సభ)కు పోటీ చేసిన రిపబ్లికన్​ క్యాండిడేట్​ రిక్​ మెహతా ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్​ క్యాండిడేట్​ సెనేటర్​ కోరీ బుకర్​ చేతిలో ఓడిపోయారు. మెహతాకు పది లక్షల 71 వేల 726 (37.9%) ఓట్లు పోలవగా.. బుకర్​కు 17 లక్షల 14 వేల 375 (60.6%) ఓట్లు వచ్చాయి. అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ అధికారిగా మెహతా పనిచేశారు.

For More News..

అమెరికా ఎన్నికల్లో ఇంకా తేలని ఫలితం.. హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్

సన్న వడ్లపై బోనస్​ తేల్తలే.. రైతు గోస తీర్తలే