న్యూఢిల్లీ: భారత తయారీ రంగం ఈ ఏడాది ఏప్రిల్‌లో స్వల్పంగా పుంజుకుంది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా ఏప్రిల్‌లో 54.7కి చేరింది. మార్చిలో 53.9 గా నమోదైంది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినా, వృద్ధి గత మూడు–నాలుగేళ్ల స్థాయిల కంటే తక్కువగా ఉంది. ప్రకటనలు, డిమాండ్ ఆధారిత అమ్మకాలు ఉత్పత్తికి మద్దతుగా ఉన్నాయి.
అయినప్పటికీ పశ్చిమాసియా యుద్ధం, పోటీ పరిస్థితులు వంటి కారణాలతో వృద్ధి నెమ్మదించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముడిసరుకుల ఖర్చులు ఆగస్టు 2022 తర్వాత అత్యధికంగా పెరిగాయి. ఔట్ పుట్ ధరలు ఆరు నెలల్లో వేగంగా పెరిగాయి. అల్యూమినియం, కెమికల్స్, ఫ్యూయల్, లెదర్, రబ్బర్ ధరల పెరుగుదల వల్ల ఖర్చులు మరింత భారమయ్యాయి. ఎగుమతి ఆర్డర్లు ఏప్రిల్‌లో 7 నెలల గరిష్టానికి చేరాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, చైనా, సౌదీ, యూఏఈ, యూకే నుంచి డిమాండ్ బలంగా ఉంది. ఉద్యోగాలు స్వల్పంగా పెరిగి 10 నెలల్లో అత్యధిక స్థాయికి
చేరాయి.
