ఈసారి జీడీపీ వృద్ధి 6 శాతమే

ఈసారి జీడీపీ వృద్ధి 6 శాతమే
  •     2026–27  అంచనాను 6.8 శాతం నుంచి తగ్గించిన మూడీస్‌
  •     పశ్చిమాసియా ఉద్రిక్తతలతో  ద్రవ్యోల్బణం 4.8 శాతానికి..

న్యూఢిల్లీ:  వెస్ట్‌‌‌‌ ఏషియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై నెగెటివ్‌‌‌‌ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 6 శాతానికి ఫైనాన్షియల్ కంపెనీ మూడీస్ రేటింగ్స్ తగ్గించింది. ముఖ్యంగా ఎల్‌‌‌‌పీజీ సరఫరాలో అంతరాయం, ఇంధన ధరలు, రవాణా ఖర్చుల పెరుగుదల,  ఎరువుల కోసం దిగుమతులపై ఆధారపడటం వంటి  కారణాల వలన  వినియోగం పడిపోతుందని, ఇండస్ట్రీల కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, ఫలితంగా ఇండియాలోకి వస్తున్న  పెట్టుబడుల వేగం తగ్గుతుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అది పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. 

మూడీస్‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం,  2026–27లో సగటు ద్రవ్యోల్బణం 4.8 శాతం వరకు చేరొచ్చు.  ఇది 2025–26లో 2.4 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం లేదా క్రమంగా పెంచే అవకాశం ఉంది”అని వివరించింది.  కిందటి నెల ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ (ఓఈసీడీ) కూడా 2026–27 కోసం వృద్ధి అంచనాను 6.1 శాతానికి తగ్గించింది. 2025–26 లో 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈవై కూడా  యుద్ధం కొనసాగితే జీడీపీ వృద్ధి 1 శాతం తగ్గి, రిటైల్‌‌‌‌ ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.  మరో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా  కూడా 2026–27 లో ఇండియా జీడీపీ వృద్ధి 6.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.