దేశంలో తగ్గిన శిశు మరణాల రేటు

దేశంలో తగ్గిన శిశు మరణాల రేటు
  • 11 ఏళ్లలో 42 శాతం తగ్గిన శిశు మరణాలు
  • ప్రపంచ సగటు  కంటే ఇంకా వెనుకే
  • శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే నివేదికలో వెల్లడి

ఇండియాలో శిశు మరణాల రేటు(ఐఎంఆర్) 42 శాతం తగ్గింది. 2006లో ప్రతి వెయ్యి జననాలకు 57 శాతం మరణాలు ఉండగా, 2017లో 33 శాతానికి తగ్గిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే(ఎస్ఆర్ఎస్) వెల్లడించింది. హోం శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ దీన్ని నిర్వహిస్తుంది. అయినా, ఇండియాలో ఐఎంఆర్ ప్రపంచ సగటు కంటే ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో సగటున వెయ్యి జననాలకు, 29.4 శాతం శిశువులు చనిపోతున్నారు. మన దేశ శిశు మరణాల సగటు పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్‌‌కు  సమానం. పాకిస్థాన్, మయన్మార్ మినహా ఇరుగుపొరుగున ఉన్న దేశాలన్నీ మనకంటే మెరుగ్గానే ఉన్నాయి. దేశంలో ఆరోగ్య రంగం పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు దీనినే కొంతవరకు ప్రామాణికంగా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐఎంఆర్ 37 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 23 శాతంగా ఉంది. గ్రామాల్లో వైద్య సేవల కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్‌‌హెచ్ఎం) పథకాన్ని 2005 నుంచి అమలు చేస్తున్నా, ఇంకా దాని ఫలాలు  ఆశించిన స్థాయిలో అందట్లేదు.

మధ్య ప్రదేశ్‌‌లోనే ఎక్కువ

2017లో శిశు మరణాల్లో 47 శాతంతో మధ్యప్రదేశ్ టాప్‌‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం(44), అరుణాచల్ ప్రదేశ్(42)తో ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఐఎంఆర్, పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌‌తో సమానం. ఈ దేశ భూభాగం 80 శాతం సహారా ఎడారిలో ఉంది. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికలో ఈ దేశం అట్టడుగున ఉంది. నాగాలాండ్‌‌లో ఐఎంఆర్ రేటు కేవలం 7 శాతం మాత్రమే. ఇది దేశంలోనే అత్యుత్తమం. ఆ తర్వాత గోవా(9), కేరళ(10), పుదుచ్చేరి(11), సిక్కిం(12), మణిపూర్(12) ఉన్నాయి. వీటిలో ఒక్క పుదుచ్చేరి మినహా మిగతా రాష్ట్రాల జనాభా కోటి కంటే తక్కువే.

కొన్ని రాష్ట్రాల్లో భారీ తేడా..

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 2006లో ఉన్న ఐఎంఆర్ రేటుకు, నేటి పరిస్థితికి చాలా తేడా ఉంది. న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో మరణాలు 37 నుంచి 16కి తగ్గాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌‌లో 56 శాతం,  పంజాబ్‌‌లో 52 శాతం మేర తగ్గాయి. నాగాలాండ్‌‌లో 65 శాతం, సిక్కింలో 64 శాతం, దాద్రా నగర్ హవేలిలో 63 శాతం, పుదుచ్చేరిలో 61 శాతం మేర శిశు మరణాలు తగ్గాయి.  మణిపూర్ 11 నుంచి 12కి, అరుణాచల్ ప్రదేశ్‌‌లో 40 నుంచి 42కి పెరిగాయి. ఉత్తరాఖండ్‌‌లో ఐదు శాతం, పశ్చిమ బెంగాల్‌‌లో 15.8 శాతం, త్రిపురలో 19.4 శాతం మేర పిల్లల మరణాలు తగ్గాయి.