ఇండియా ఎల్‌‌‌‌పీజీ దిగుమతులు 46 శాతం డౌన్‌‌‌‌

ఇండియా ఎల్‌‌‌‌పీజీ దిగుమతులు 46 శాతం డౌన్‌‌‌‌
  • మార్చిలో మిడిల్ ఈస్ట్ నుంచి భారీగా పడిపోయిన సప్లయ్‌‌‌‌
  • అమెరికా, ఇరాన్ నుంచి గ్యాస్ వచ్చినా సరిపోలే

న్యూఢిల్లీ: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌‌‌‌పీజీ) దిగుమతులు  ఈ ఏడాది మార్చిలో భారీగా పడిపోయాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే 46 శాతం తగ్గాయి. సరఫరా తగ్గడంతో గ్యాస్ కొరత  నెలకొంది.  మిడిల్ ఈస్ట్ సరఫరాదారుల నుంచి షిప్‌‌‌‌మెంట్లు గణనీయంగా తగ్గగా, మరోవైపు  అమెరికా, ఇరాన్ ఈ లోటును కొంతవరకు భర్తీ చేశాయి. ఇండియా ఎల్‌‌‌‌పీజీ దిగుమతులు  జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే మార్చిలో  46శాతం తగ్గి సుమారు 12.2 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. అమెరికా భారత్‌‌‌‌కు అతి పెద్ద ఎల్‌‌‌‌పీజీ సరఫరాదారుగా అవతరించింది. 

ఇరాన్ దాదాపు ఏడేళ్ల తర్వాత షిప్‌‌‌‌మెంట్లను తిరిగి ప్రారంభించింది.  “ప్రపంచ ఎల్‌‌‌‌పీజీ ఎగుమతుల్లో సుమారు మూడింట ఒక వంతు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ నుంచి వచ్చి హార్మూజ్ ద్వారా వెళ్తుంది. పశ్చిమాసియాలో  పరిస్థితులు మెరుగైనా,  సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌లను పునరుద్ధరించడం, లాజిస్టిక్స్ సాధారణ స్థాయికి తీసుకురావడానికి  సమయం పడుతుంది. దీని వల్ల అంతర్జాతీయంగా ఎల్‌‌‌‌పీజీ ధరలు సమీప భవిష్యత్తులో గరిష్టాల్లోనే ఉంటాయి”  అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ కెప్లర్ ఎనలిస్ట్ నిఖిల్ దూబే తెలిపారు.

ఇండియాకు యూఏఈ,  ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి  మార్చిలో కేవలం 6.72 లక్షల టన్నులు (మొత్తం దిగుమతుల్లో 55శాతం) మాత్రమే సరఫరా అయ్యింది.  ఇది జనవరి నెలతో పోలిస్తే 36శాతం, ఫిబ్రవరి నెలతో పోలిస్తే 40శాతం తగ్గుదల. అమెరికా మార్చి నెలలో 4.20 లక్షల టన్నులు సరఫరా చేసి అతి పెద్ద సరఫరాదారుగా అవతరించింది. ఇరాన్ 43 వేల టన్నులు సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏమీ లేవు. అర్జెంటీనా, మలేషియా నుంచి కూడా చిన్న మొత్తాల్లో దిగుమతులు జరిగాయి.

కాగా, భారత్ ఎల్‌‌‌‌పీజీ వినియోగంలో సుమారు 60శాతం దిగుమతులపై ఆధారపడి ఉండటం వల్ల దిగుమతుల్లో ఏర్పడిన లోటు వలన గ్యాస్ కొరత ఏర్పడింది.  మార్చి మధ్యలో దేశీయ ఉత్పత్తి 40శాతం పెరిగినా ఈ లోటు పూర్తిగా భర్తీ కాలేదు. ఆయిల్ రిఫైనరీలు  ఎల్‌‌‌‌పీజీ ఉత్పత్తి పెంచాలని కిందటి నెలలో ఆయిల్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కానీ,  ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్, ఫుడ్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగాల నుంచి డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయాన్ని కొంత వరకు వెనక్కి తీసుకునే చాన్స్ ఉంది.

బ్రెంట్ క్రూడాయిల్ ధర 109 డాలర్లు
ఇరాన్‌‌‌‌పై దాడులు రానున్న రెండు మూడు వారాల్లో  మరింత తీవ్రంగా ఉంటాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో  బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం 8 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌కు 109.24 డాలర్లకు చేరింది.  అమెరికా  వెస్ట్ టెక్సాస్‌‌‌‌ ఇంటర్మీడియెట్‌‌‌‌ (డబ్యూటీఐ) ధర 111.54 డాలర్లకు ఎగిసింది.  డబ్యూటీఐ ధర గత వారం రోజుల్లో 11 శాతం పెరిగింది. గతంలో డబ్ల్యూటీఐ కంటే బ్రెంట్ ధర 5–10 డాలర్లు ఎక్కువ ఉండేది. 

మార్చిలో గ్యాస్ సప్లయ్ చేసిన దేశాలు (లక్షల టన్నుల్లో)

  • దేశం    ఎల్‌‌‌‌పీజీ
  • అమెరికా     4.20
  • యూఏఈ    2.26
  • ఖతార్‌‌‌‌‌‌‌‌    1.30
  • సౌదీ అరేబియా    0.90
  • ఇరాన్‌‌‌‌    0.43
  • ఇతరులు    0.84