బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన ‘అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్’ (APSEZ) సంస్థ వ్యాపారాన్ని విదేశాలకు మరింత విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా యూకే (యూనిైటెడ్ కింగ్‌డమ్) లోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన ‘అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్’ (ABP) సంస్థను దక్కించుకోవడానికి బిడ్ వేసే అంశాన్ని అదానీ గ్రూప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలపై అదానీ పోర్ట్స్ ప్రతినిధి స్పందిస్తూ.. "మేము సాధారణంగా మార్కెట్ ఊహాగానాలపై మాట్లాడం. మా దీర్ఘకాలిక వ్యాపార వృద్ధికి, వాటాదారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే ఏ అవకాశాన్నయినా పరిశీలిస్తూనే ఉంటాం" అని తెలిపారు.
ABP ప్రత్యేకత ఏంటంటే?
ఈ సంస్థ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లలో సౌతాంప్టన్, హంబర్ వంటి ప్రాంతాలతో కలిపి మొత్తం 21 ఓడరేవులను నిర్వహిస్తోంది. యూకే దేశపు మొత్తం సముద్ర వాణిజ్యంలో దాదాపు నాలుగో వంతు వ్యాపారం ఈ పోర్టుల ద్వారానే జరుగుతుంది. ఇక్కడ కంటైనర్లు, కార్లు, క్రూయిజ్ నౌకలు, వివిధ రకాల సరుకుల రవాణా జరుగుతుండటంతో పాటు రిెయిల్ ఎస్టేట్ రంగంలోనూ కార్యకలాపాలు ఉన్నాయి.
భారీ విలువైన లావాదేవీ
ఈ ఏబీపీ (ABP) సంస్థలో కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్స్ (CPP ఇన్వెస్ట్‌మెంట్స్, ఒంటారియో మునిసిపల్) కలిసి దాదాపు 64 శాతం వాటాతో ఉన్నాయి. ఈ కంపెనీ విలువ సుమారు £10 బిలియన్లకు అంటే భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డీల్ కుదిరితే, అదానీ పోర్ట్స్ చరిత్రలో ఇదే అత్యంత పెద్ద విదేశీ కొనుగోలు అవుతుంది. యూరప్‌లో అడుగుపెట్టడానికి ఇదొక పెద్ద వేదికగా మారుతుంది.
విదేశాల్లో విస్తరిస్తున్న అదానీ పోర్ట్స్
అదానీ గ్రూప్ ఇప్పటికే భారత్ దాటి ప్రపంచంలోని పలు దేశాల్లో పోర్టు వ్యాపారాన్ని పెంచుకుంటోంది. ఇజ్రాయెల్‌లోని ఫెమస్ హైఫా పోర్ట్‌ను సుమారు $1.18 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇందులో అదానీకి 70% వాటా ఉంది. శ్రీలంకలోని కొలంబో, టాంజానియాలోని డార్ ఎస్ సలామ్, ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌లాండ్‌లో కూడా టెర్మినల్స్, పోర్టుల నిర్వహణ చేపట్టింది.
భారతదేశంలో ముంద్రా, కృష్ణపట్నం, గంగవరం వంటి ప్రధాన ఓడరేవులతో కలిపి మొత్తం 15 పోర్టులు ఉన్న ఏపీఎస్‌ఈజెడ్ (APSEZ).. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 500 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. రాబోయే 2030 నాటికి దీనిని ఏటా ఒక బిలియన్ టన్నులకు పెంచాలన్నదే అదానీ గ్రూప్ లక్ష్యం.
