న్యూఢిల్లీ: పశ్చిమాసియలో సంక్షోభం, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 'లార్సెన్ అండ్ టూబ్రో' (ఎల్&టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) మొదటి త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరిచింది. జూన్ 30తో ముగిసిన క్యూ1 కాలానికి గాను కంపెనీ నికర లాభం వార్షికంగా 14 శాతం పెరిగి రూ.4,123 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,617 కోట్లుగా నమోదైంది. కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7 శాతం వృద్ధి చెంది రూ.67,942 కోట్లకు చేరింది.
క్యూ1లో ఎల్ అండ్ టీ రూ.1,08,014 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకుంది. ఏడాది లెక్కన 14శాతం వృద్ధి నమోదైంది. దీంతో కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ విలువ ఏకంగా రూ.7.8 లక్షల కోట్లకు చేరడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త ఆర్డర్లలో 52 శాతం, మొత్తం ఆర్డర్ బుక్‌లో 56 శాతం వాటా విదేశీ ప్రాజెక్టులదే కావడం గమనార్హం.
" నాన్-కోర్ ఆస్తుల విక్రయంలో భాగంగా 'నాభా పవర్' విక్రయం పూర్తికాగా, 'హైదరాబాద్ మెట్రో'లో వాటాలను తెలంగాణ ప్రభుత్వానికి విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది" అని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ తెలిపారు.
