హైదరాబాద్, వెలుగు: పెగాసిస్టమ్స్ తన ‘యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్’ (యూఏపీ) ను విస్తరిస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఏఐ (ఏఐ), పెగా బ్లూప్రింట్, ఏజెంటిక్ ఇంజనీరింగ్‌తో పాటు మానవ నైపుణ్యాలలో శిక్షణనిచ్చేందుకు స్మార్ట్‌బ్రిడ్జ్, ఏఐ4ప్రాసెస్, ది స్కిల్ ఎన్‌హాన్సర్స్, టింకర్ లెర్నింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించింది.
పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా మొదటి రోజు నుంచే ఉద్యోగానికి సిద్ధమయ్యే నైపుణ్యాలను అందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని పెగా ఇండియా ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 50కి పైగా కళాశాలల నుంచి 800-–1,000 మంది గ్రాడ్యుయేట్లకు పరిశ్రమ స్థాయి శిక్షణ ఇస్తామని అన్నారు.
