- వార్షికంగా ఐదు శాతం పెరుగుదల
- 2030 నాటికి రూ.12.05 లక్షల కోట్లకు చేరే చాన్స్
- ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను వెల్లడి
హైదరాబాద్: మన దేశ ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరిలో 28 బిలియన్ డాలర్లు (రూ.2,59,672 కోట్లు) దాటింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌తో పోలిస్తే 5 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ కె.రాజా భాను శనివారం వెల్లడించారు. ఫార్మా ఎగుమతులను పెంచడం లక్ష్యంగా హైదరాబాద్లో శనివారం నిర్వహించిన చింతన్ శివిర్ సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం భారత ఫార్మా రంగం విలువ 60 బిలియన్ డాలర్లు (రూ.5.56 లక్షల కోట్లు) ఉండగా ఇది 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు (రూ.12.05 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఫార్మా రంగం వృద్ధి పథంలో సాగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఎగుమతులు 28.29 బిలియన్ డాలర్లు (రూ.2,62,361 కోట్లు) గా నమోదయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 5.6 శాతం వృద్ధి. ముఖ్యంగా వ్యాక్సిన్లు, ఆయుష్ ఉత్పత్తులు, బయలాజికల్స్ ఎగుమతులు పెరగడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. అంతర్జాతీయంగా ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లకు (రూ.2,82,579 కోట్లు) చేరి 9.4 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి.
కరెన్సీ ప్రభావంతో ఇబ్బందులు
ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ డాలర్ల రూపంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కొంత కష్టమైనా రూపాయి పరంగా ఎగుమతుల్లో వృద్ధి కనిపిస్తుందని చెప్పారు. రూపాయి విలువ తగ్గుతున్న నేపథ్యంలో ఈ మార్పు కనిపిస్తుందని ఆయన వివరించారు. మందుల తయారీకి వాడే ముడి పదార్థాల దిగుమతులను తగ్గించి, స్థానికంగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని గత ఏడాది స్థాయిలోనే ముగించే అవకాశం ఉందని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి అభిప్రాయపడ్డారు. అమెరికాలో 2025లో టారిఫ్ సంబంధిత సమస్యల వల్ల 1.6 బిలియన్ డాలర్ల (రూ.14,838 కోట్లు) అదనపు ప్రొక్యూర్మెంట్ జరిగిందని, ఇది 2026 లెక్కలపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా వాటా 34 శాతం
భారత ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 34 శాతం కాగా, యూరప్ వాటా 19 శాతంగా ఉంది. మొత్తం ఎగుమతుల్లో 60 శాతం కంటే ఎక్కువ రెగ్యులేటెడ్ మార్కెట్లకు వెళ్తున్నాయి. ఇది భారత మందుల నాణ్యత, ప్రమాణాలను తెలియజేస్తోంది. 2030 నాటికి 65 బిలియన్ డాలర్ల (రూ.6,02,810 కోట్లు) ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలని ఫార్మెక్సిల్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కొత్త మార్కెట్లను అన్వేషించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఉత్పత్తి పరిమాణంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. మార్చి నెలకు సంబంధించిన డేటా వచ్చిన తర్వాత పూర్తి స్థాయి లెక్కలు అందుబాటులోకి వస్తాయి.
