‘జల శక్తి’ దేశం దాహం తీరుస్తుందా?

‘జల శక్తి’ దేశం దాహం తీరుస్తుందా?
  • 21 నగరాల్లో భూగర్భజలాలు ఖాళీ
  • పాకిస్థాన్ కు పోతున్న మన నీళ్లు
  • పొరుగు రాష్ట్రాల మధ్యా వివాదాలు

జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా నది క్లీనింగ్, తాగునీరు, పరిశుభ్రత దేశాభివృద్ధికి కీలకమైన ఈ ఐదింటిని భారత సర్కారు ‘జల శక్తి’ మంత్రిత్వ శాఖ కిందకు తెచ్చింది. రెండోసారి అధికారంలోకి వస్తే పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలందరికీ అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల్లో హామీనిచ్చారు. మినిస్ట్రీ పేరు మార్పుతోనే ప్రక్షాళన మొదలుపెట్టినట్టున్నారు.  గజేంద్ర సింగ్
షెకావత్ చేతికి జల శక్తి పగ్గాలు ఇచ్చారు. దేశం మొత్తానికి శుభ్రమైన తాగునీళ్లు ఇస్తామనే హామీ సాహసమైనదే.

21 నగరాల్లో భూగర్భ జలాలు ఔట్

ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి 21 నగరాల్లో భూగర్భజలాలు తగ్గాయి. పరిస్థితి ఇలానే ఉంటే 2020 నాటికి చుక్క నీరు ఉండదు. దీని వల్ల 10 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. 75 శాతం ఇళ్లకు తాగునీళ్ల కనెక్షన్లు లేవంది. వీళ్లందరూ మంచినీళ్ల కోసం బయటకు వెళ్లాల్సిందేనని తెలిపింది.

కొత్త మినిస్ట్రీ దేనికి?

జల శక్తిని క్రియేట్ చేయడం వెనుక ఉన్న కారణాల్లో ఒకటి డ్రింకింగ్ వాటర్, పరిశుభ్రత, హౌసింగ్, పట్టణ పేదరికం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి డిపార్ట్ మెంట్లు వేర్వేరు శాఖల్లో ఉండటం. వీటిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాడానికి వీలు పడుతుంది.

భూగర్భజలాలు పెంచాలి

దేశంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమస్యకు జల శక్తి వెంటనే పరిష్కారాన్ని కనుగొనాలి. భూగర్భ జలాలను పెంచుతూ, అందరికీ తాగునీరు అందజేయాలి.

నీళ్ల కొట్లాట ఆపాలి

నదుల నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య పోరును ‘జల శక్తి’ ఆపగలగాలి. ముఖ్యంగా కావేరి నది నీళ్లపై కర్ణాటక, తమిళనాడు చూపుతున్న దూకుడుకు అడ్డుకట్ట వేయాలి. లేకపోతే శాంతిభద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఫస్ట్ చాలెంజ్!

కొత్త మినిస్ట్రీ ముందున్న తొలి చాలెంజ్ ఇండియా నుంచి పాకిస్థాన్ కు తరలిపోతున్న నీళ్లను ఆపడం. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లజ్ నదుల్లో నీటిని మొత్తాన్ని ఇండియా వాడుకోవచ్చు. చినాబ్, సింధూ, జీలం నదుల నీళ్లను పాకిస్థాన్ కు కేటాయించారు. రెండు దేశాలుగా విడిపోయిన నాటి నుంచి రావి, బియాస్, సట్లజ్ నీళ్లను పాకిస్థాన్ వాడుకుంటూనే ఉంది. వాటిని ఇండియా ఎన్నడూ ఆపలేదు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఈ మూడు నదుల నీళ్లు పాకిస్థాన్ కు చేరనివ్వకూడదనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇదంత సులువైన పనేమీ కాదు. ఈ మూడు నదులపైనా ఇండియా ప్రాజెక్టులు కట్టాల్సివుంది. ఇది రాత్రికి రాత్రి జరిగిపోయే పని కాకపోయినా జల శక్తి మినిస్ట్రీ వేగంగా పూర్తి చేయగలదు.