షిజువోకా: ఇండియా స్టార్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్.. జపాన్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో మూడు స్వర్ణాలతో మెరిశాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3 ఫైనల్లో ప్రమోద్ 17–21, 21–19, 21–10తో డైసుకి ఫుజిహర (జపాన్)పై గెలిచాడు. తొలి గేమ్‌లో ఓడి రెండో గేమ్‌లో 16–19తో వెనకబడిన ఇండియన్ ప్లేయర్ అద్భుతంగా పుంజుకున్నాడు. గంటా 33 నిమిషాల పాటు పోరాడి విజయం సాధించాడు.
మెన్స్ డబుల్స్ ఎస్‌ఎల్3–ఎస్‌ఎల్4 టైటిల్ ఫైట్‌లో ప్రమోద్–సుకాంత్ కడమ్ 21–17, 18–21, 21–16తో జగదీశ్ డిలీ–నవీన్ శివకుమార్‌పై నెగ్గి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్4–ఎస్‌యూ5 ఫైనల్లో మనీషా రామ్‌దాస్‌తో జత కట్టిన ప్రమోద్ 21–19, 21–19తో నితీశ్ కుమార్–తులసిమతి మురుగేశన్‌పై గెలిచి హ్యాట్రిక్ స్వర్ణం సాధించాడు. ఎస్‌హెచ్6 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో కృష్ణ నగర్ 22–20, 21–13తో మైల్స్ క్రజేవిస్కీ (అమెరికా)పై గెలిచాడు. మిక్స్‌డ్ ఫైనల్లో కృష్ణ నగర్–నిత్య శ్రీ జోడి స్వర్ణం సాధించారు. ఎస్‌ఎల్4 సింగిల్స్‌లో సుకాంత్ కడమ్.. శివకుమార్ చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్ ఎస్‌ఎల్3 కేటగిరీలో మన్‌దీప్ కౌర్, నీరజ్ సిల్వర్ పతకాలను గెలిచారు. విమెన్స్ డబుల్స్‌లో మాన్సి జోషి–తులసిమతి మురుగేశన్ గోల్డ్, నీరజ్–ఆరతి, సంజన కుమారి–శాంతియా ద్వయం బ్రాంజ్ మెడల్స్‌ను కైవసం చేసుకున్నారు.
