V6 News

ఇండిగో సంక్షోభంపై చైర్మెన్ విక్రమ్ మెహతా క్షమాపణలు.. నిపుణుల విచారణకు పిలుపు..

ఇండిగో సంక్షోభంపై చైర్మెన్ విక్రమ్ మెహతా క్షమాపణలు.. నిపుణుల విచారణకు పిలుపు..

ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. సిబ్బంది కొరత కారణంగా గత కొద్దిరోజులుగా వరుసగా వందలాది విమానాలు రద్దవ్వడంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్స్ రద్దు చేయడంతో ఇండిగో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. ఎట్టకేలకు కేంద్రం జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేసింది. క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేయడంతో గాడిలో పడింది ఇండిగో. ఈ క్రమంలో ఇండిగో చైర్మెన్ విక్రమ్ మెహతా సంక్షోభంపై అధికారికంగా క్షమాపణలు తెలిపారు. ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ తో విచారణకు పిలుపునిచ్చారు విక్రమ్ మెహతా.

ఇండిగో వైఫల్యం కారణంగా తలెత్తిన భారీగా విమానాల రద్దు, జాప్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారని అన్నారు మెహతా. ఇందుకు పదే పదే క్షమాపణలు తెలిపారు మెహతా. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు నిబద్దతతో ఉన్నామని అన్నారు మెహతా. 
డిసెంబర్ 3 నుంచి తలెత్తిన లోపాల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఊహించని సంఘటనల కారణంగా గత కొద్ది రోజుల పాటు పెద్ద ఎత్తున విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. 

వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారని.. కీలకమైన కుటుంబ సమావేశాలు, వ్యాపార సమావేశాలు, వైద్య నియామకాలు, అంతర్జాతీయ కనెక్షన్‌లను కోల్పోయారని అన్నారు. ఈ సంక్షోభం ప్రయాణికులకు ఎంత బాధను కలిగించిందో తనకు తెలుసనీ... మేము ప్రయాణికుల అంచనాలు అందుకోలేకపోయామని అన్నారు మెహతా. ఇందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు విక్రమ్ మెహతా.