కొడిమ్యాల,వెలుగు: ఆఫీసర్ల తప్పిదంతో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మూడు నెలలుగా తిప్పలు పడుతోంది. దీంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. వివరాలిలా ఉనాయి.. కొడిమ్యాల మండలంలో రామారావుపేటకు చెందిన వడ్లకొండ వజ్రమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. మూడు నెలల కింద రూ.2లక్షల అప్పుచేసి ఇంటి నిర్మాణం ప్రారంభించింది. బేస్‌మెంట్ లెవెల్ వరకు పూర్తిచేసి ఫొటో తీయించి, మొదటి విడత డబ్బుల కోసం ఎదురుచూసింది. కాగా జీపీ సిబ్బంది వజ్రమ్మ ఆధార్‌నంబర్‌ను తప్పుగా ఎంటర్ చేయడంతో మొదటి విడత డబ్బు పడలేదు.
ఈ విషయాన్ని జీపీ సిబ్బంది ఆమెకు చెప్పకపోగా.. అకౌంట్ చెక్ చేసుకోవాలని చెప్పడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. ఈ విషయాన్ని ఎంపీడీవో స్వరూప దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బంది ఫోన్ ద్వారా ఆధార్ ఎంట్రీ చేసేటప్పుడు తప్పు జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
