హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి నిధులు రాకున్నా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లులను నిలిపివేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నామని, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసినా ఇప్పటివరకు రూపాయి విడుదల కాలేదని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2023 వరకు పదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం జరగలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్లకు భారీగా డిమాండ్ రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న ఆశతో పూర్తయిన ఇళ్లకు చివరి బిల్లుల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. కానీ పేదలను ఇబ్బంది పెట్టలేమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందన్నారు.
ఇయ్యాల చివరి బిల్లులు జమ..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని గురువారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, మిగిలిన వారికి విడతల వారీగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు సుమారు 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. రెండో విడత పథకాన్ని ప్రారంభించామని, వచ్చే నెల 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు.
