అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు..ఐ అండ్​ పీఆర్​ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు..ఐ అండ్​ పీఆర్​ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఐ అండ్ పీఆర్​శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు.. అలాగే, వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. మండల, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 

గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనానికి మరమ్మతులు పూర్తి చేయించి ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామన్నారు. విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు చేస్తున్నదన్నారు.  జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.లక్ష-తో పాటు ఐదు సంవత్సరాల వరకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు రూ. వెయ్యి -చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఖాతాలో మొత్తం రూ.8.98 కోట్లు ఆర్థిక సహాయం అందించామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్  కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్  వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.