ప్రజాదర్బార్ కు వెల్లువలా దరఖాస్తులు ..ఇందిరమ్మ ఇండ్ల కోసమే 51 శాతం మంది వినతి

ప్రజాదర్బార్ కు వెల్లువలా దరఖాస్తులు ..ఇందిరమ్మ ఇండ్ల కోసమే 51 శాతం మంది వినతి
  • ఇందిరమ్మ ఇండ్ల కోసమే 51 శాతం మంది వినతి 
  • ల్యాండ్, సాదాబైనామా ఇష్యూస్​పై 17 శాతం అప్లికేషన్లు
  • ఆసరా పింఛన్ల కోసం 13 శాతం
  • పాలేరు నియోజకవర్గంలో 13 క్లస్టర్లలో ప్రజా దర్బార్లు పూర్తి 
  • త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్లు నిర్వహించాలని ప్లాన్​ 

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సొంత నియోజకవర్గం ఖమ్మం జిల్లా పాలేరులో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్​లో ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 13 క్లస్టర్లలో ప్రజా దర్బార్ కార్యక్రమం పూర్తి కాగా, 23 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో సగానికి పైగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాగా, భూ వివాదాలు, సాదాబైనామాలకు సంబంధించి 17 శాతం, పెన్షన్ల కోసం 13 శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు.

గృహజ్యోతి, గ్యాస్​ సబ్సిడీ కోసం 3 శాతం, రేషన్ కార్డుల కోసం 10 శాతం, ఆరోగ్యం, విద్యకు సంబంధించి మిగిలిన అప్లికేషన్లున్నాయి. ప్రజల నుంచి నేరుగా మంత్రి పొంగులేటి దరఖాస్తులు తీసుకుంటుండగా, వాటిని స్పాట్ లోనే ఆయా డిపార్ట్ మెంట్ల సిబ్బంది ఆన్​లైన్​ చేస్తున్నారు. వాటిని శాఖల వారీగా కేటగిరీలుగా విభజించి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. అన్ని డిపార్ట్ మెంట్ల జిల్లా అధికారులు ప్రజా దర్బార్​కు హాజరవుతుండగా, అక్కడికక్కడే పరిష్కరించగలిగే వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు, మూడు నెలలు.. ఇలా ఆయా అప్లికేషన్ల పరిష్కారానికి కాల వ్యవధిని పెట్టుకొని, పరిష్కరించాలని నిర్ణయించారు. 

క్లస్టర్లుగా విభజించి సదస్సులు..

ప్రజలను కలిసి, వారి నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు గత నెల 25న ప్రజా దర్బార్  కార్యక్రమాన్ని నేలకొండపల్లి మండలం రాయగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించారు. ఏదులాపురం మున్సిపాలిటీని రెండు క్లస్టర్లుగా విభజించడంతో పాటు నియోజకవర్గంలో 14 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 13 క్లస్టర్లలో ప్రజా దర్బార్లు పూర్తయ్యాయి. 

ఏదులాపురం మున్సిపాలిటీలో మిగిలిన చివరి క్లస్టర్ లో ప్రజాదర్బార్​ ను ఈ వీకెండ్ లో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ల వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని కలెక్టర్​ దివాకరను మంత్రి ఆదేశించారు. దీనిపై క్యాబినెట్ లో చర్చించి, ఇతర జిల్లాల్లో కూడా ప్రజా దర్బార్లను నిర్వహించే ఆలోచన ఉందని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్​ సర్కార్​ పదేళ్ల పాటు డబుల్  బెడ్రూమ్​ పేరుతో మభ్యపెట్టడంతో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ప్రజా దర్బార్​లో వచ్చిన దరఖాస్తులను ఎల్  వన్, ఎల్  టూ, ఎల్  త్రీ కేటగిరీలుగా విభజించి, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెబుతున్నారు. 

కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన షేక్  షకీనాకు ఎడమ కాలు లేదు. కూసుమంచిలో నిర్వహించిన ప్రజా దర్బార్​లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి సమస్యను చెప్పుకుంది. ‘అయ్యా.. కాలు లేక తిప్పలు పడుతున్నాను. ఒక చక్రాల కుర్చీ ఇప్పిస్తే, ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటాను’ అని వేడుకుంది. కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న బాధితురాలి పరిస్థితి చూసి చలించిన పొంగులేటి, రెండు గంటల్లోనే ఆమెకు వీల్  చైర్  తెప్పించి  అందజేశారు. తనకు అండగా నిలిచిన మంత్రికి షకీనా కృతజ్ఞతలు తెలియజేసింది.