ఇందిరమ్మ ఇండ్లకు శ్రావణ శోభ .. జనగామ జిల్లాలో స్పీడందుకుంటున్ననిర్మాణ పనులు

ఇందిరమ్మ ఇండ్లకు శ్రావణ శోభ .. జనగామ జిల్లాలో స్పీడందుకుంటున్ననిర్మాణ పనులు
  • స్పీడందుకుంటున్న నిర్మాణ పనులు​
  • ఉమ్మడి జిల్లాకు 49, 853 ఇండ్ల కేటాయింపు 
  • ఇప్పటి వరకు 26,617 ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి 
  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో జనగామ టాప్​ ప్లేస్

జనగామ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రావణ మాసం శోభ సంతరించుకుంది. ఇన్నాళ్లూ ఆషాఢం అడ్డంకిగా మారగా ప్రస్తుతం లబ్ధిదారులు ఇండ్లకు ముగ్గులు పోసుకుంటున్నారు. ఇండ్ల గ్రౌండింగ్ పై అధికారులు స్పెషల్ ఫోకస్​ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్​ జిల్లాకు మొత్తంగా 49,853 ఇండ్లను కేటాయించగా, వెరిఫికేషన్​తర్వాత 39,521 ఇండ్లను అధికారులు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటివరకు​ 26,617 ఇండ్లకు గ్రౌండింగ్​ పూర్తవగా, వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి. 

గ్రౌండింగ్ పై ఫోకస్..​ 

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో ఇండ్ల గ్రౌండింగ్ పై యంత్రాంగం స్పెషల్​ ఫోకస్ పెట్టింది. జనగామ కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్​ తోపాటు మిగతా జిల్లాల కలెక్టర్లు నిత్యం అధికారులతో రివ్యూలు చేస్తూ, ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. డబ్బుల ఇబ్బందులు ఉంటే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇసుక ఇక్కట్లకు చెక్​పెట్టేలా అలర్ట్​ చేస్తున్నారు. కాగా, ఇండ్ల కేటాయింపులను ప్రభుత్వం ఎల్​1, ఎల్​2, ఎల్​3 దశలుగా గుర్తించి మంజూరు ఇస్తున్న విషయం తెలిసిందే. ఎల్ 1 లో ఇంటి స్థలం (మినిమం 70 గజాలు) ఉన్న నిరుపేదలకు అవకాశం కల్పిస్తున్నారు.

 పెంకుటిళ్లు, రేకులు, గుడిసె, 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి, నెలకు రూ.15 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారి అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకుని మంజూరు చేశారు. ఇదిలాఉండగా, జనవరి 26న ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాల్లో బేస్మెంట్ దశ పూర్తి చేసుకున్న వారికి తొలి విడతగా రూ.లక్ష చొప్పున, రూఫ్​ లెవల్​ నిర్మాణాలు పూర్తైన వారికి రెండో విడతగా మరో రూ.లక్ష లబ్ధిదారుల అకౌంట్లలో జమయ్యాయి.

జనగామ టాప్ ప్లేస్..​

ఇండ్ల నిర్మాణాల్లో జనగామ జిల్లా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో టాప్​ ప్లేస్​లో ఉంది. జనగామ జిల్లాకు సర్కారు 5950 ఇండ్లను కేటాయించగా, 5636 ఇండ్లకు మంజూరు ఇచ్చారు. వీటిలో 3961 ఇండ్లు గ్రౌండింగ్ కాగా, 1711 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మహబూబాబాద్​ రెండో స్థానంలో ఉండగా, జిల్లాలో 10604 ఇండ్లు కేటాయించారు. ఇందులో 9581 ఇండ్లకు మంజూరు చేశారు. 7188 ఇండ్లు గ్రౌండింగ్ కాగా, 2872 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వరంగల్​ జిల్లాకు 12,215 ఇండ్లు కేటాయించగా, 8737 ఇండ్లకు మంజూరయ్యాయి. 

వీటిలో 5162 గ్రౌండింగ్​ కాగా, 2652 ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ములుగు జిల్లాలో 5739 ఇండ్లను కేటాయించగా, 4625 మంజూరయ్యాయి. వీటిలో 3548 గ్రౌండింగ్​ కాగా, 1169 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 10513 ఇండ్లు కేటాయించగా, 7429 ఇండ్లకు మంజూరవగా, 4824 గ్రౌండింగ్​ కాగా, 2080 ఇండ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 4832 ఇండ్లు కేటాయించగా, 3512 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 1934 ఇండ్లు గ్రౌండింగ్​ కాగా, 659 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇండ్ల నిర్మాణాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా రెండో స్థానంలో ఉండగా, మహబూబాబాద్​ 4, వరంగల్​ 9, ములుగు 10, హనుమకొండ 11, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా 18వ స్థానంలో ఉన్నాయి.