ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై విచారణ

ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై విచారణ

ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై విచారణ మొదలవుతోంది. ఇండ్లు కట్టకున్నా.. కట్టినట్లు కాగితాల్లో చూపించి బిల్లులు కాజేసింది ఎవరో తేల్చేందుకు సిద్ధమవుతోంది CID. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణంపై.. మరోసారి దర్యాప్తు చేయనుంది. దాంతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది. 2015లో ఖానాపూర్ నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో విచారణ చేశారు అధికారులు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది సీఐడీ. ఒక్కో లబ్ధిదారుడి పేరుతో రెండు, మూడు ఇళ్లు మంజూరైనట్లు గుర్తించారు. అయితే మరోసారి స్పష్టమైన వివరాలు అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో.. విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది సీఐడీ బృందం. దీంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.

2006 నుంచి 2013 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాకు 2 లక్షల 82వేల 517 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 2 లక్షల 18వేల 849 ఇళ్లను నిర్మించినట్లు బిల్లులు డ్రా అయ్యాయి. మరో 63 వేల 668 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటి నిర్మాణం కోసం 975.82 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే ఇష్టం వచ్చినట్లు ఇళ్లు మంజూరు చేయడంతో అక్రమాలు జరిగినే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు…ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నిధులు స్వాహా చేశారని కూడా ఆరోపణ ఉంది.

సొంత ఇల్లు లేనివారికి కాకుండా అనర్హులకు ఇండ్లు మంజూరు చేయించి…వారికి ఎంతో కొంత ఇచ్చి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో లబ్ధిదారుడి పేరిట ఐదు, పది ఇళ్ల చొప్పున మంజూరు అయినట్లు కూడా తెలుస్తోంది. ఇళ్లు కట్టినట్లు కాగితాల్లో చూపించి బిల్లులు కాజేశారని గతంలో జరిపిన విచారణలో తేలింది. అయితే సొంత డబ్బులు ఖర్చు చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న…వారికి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. ఇంకొందంరు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో…ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. దాంతో ఇప్పటికీ చాలా ఇండ్లు గోడలతో కనిపిస్తున్నాయి. గృహనిర్మాణ సంస్థను రద్దుచేసి అక్కడ పనిచేసే వారిని వివిధ శాఖల్లో విలీనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటి ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు మాజీలైపోయారు. దాంతో సీఐడీ విచారణలో అవినీతి బయటపడ్డా.. అక్రమార్కులను ఎలా గుర్తిస్తారన్నది ఆసక్తిగా మారింది.