కామేపల్లి/ వర్ధన్నపేట/ పర్వతగిరి (సంగెం/ గీసుగొండ)/ రఘునాథపల్లి, వెలుగు: పేదల సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పలుచోట్ల రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయగా, మరికొన్నిచోట్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేయించారు. కొత్తగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతువేదికలో జరిగిన సభలో ఆయన 140 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం, కట్ర్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే నాగరాజు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. సంగెం మండలం తిమ్మాపురంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొత్త ఇంటిని రిబ్బన్‌కట్‌చేసి ప్రారంభించారు. గీసుగొండ మండలం కొనయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లిలో నిర్మించిన ఏడు ఇందిరమ్మ ఇండ్లను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.
