హైదరాబాద్, వెలుగు: బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ‘ఇండోమ్యాక్’ శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, స్మార్ట్, ఎఫెక్టివ్, ఇంటెలిజెంట్ మెషినరీ, ఇండస్ట్రియల్ రోబోలు, ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్‌పై ఇది ఫోకస్ చేస్తుంది. ఈ మూడు రోజుల ఎక్స్‌పోలో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. కార్యక్రమం ఆదివారం ముగుస్తుంది. దాదాపు 500లకుపైగా మెషీన్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దాదాపు 400 బ్రాండ్లు పాల్గొంటున్నాయి.
మైక్రో, స్మాల్, మీడియా ఇండస్ట్రీస్ (ఎంఎస్ఎంఈ) ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ముత్తురామన్, తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి హైటెక్స్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ముత్తురామన్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు దేశీయ, ప్రపంచ మార్కెట్ల డిమాండ్‌లను తీర్చడానికి వివిధ రకాల ఉత్పత్తులను, సేవలను అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయని అన్నారు. వ్యవసాయం తర్వాత ఎంఎస్ఎంఈలే అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి కోసం కొత్త టెక్నాలజీలను వాడాలని రమాదేవి అన్నారు.
ఇంజినీరింగ్ యంత్రాలు, మెషీన్ తయారీ పరిశ్రమలు దేశానికి వెన్నెముక అని కామెంట్ చేశారు. ఇండోమ్యాక్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న ఇండోమ్యాక్ బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్లు సచిన్, సోమ, సుధీర్ భలే, మనీష్ సిన్హా సుమిత్ పర్వాల్ మాట్లాడుతూ ఇక్కడ ఇంజనీరింగ్ ప్రొడక్టులు, మెషీన్లు, ఎక్విప్మెంట్లు, సేవలను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దాదాపు 20 వేల మంది బిజినెస్ విజిటర్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
