జీసీసీ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ బంకులు: ఇంద్రకరణ్ రెడ్డి

జీసీసీ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ బంకులు: ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో జీసీసీ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసినట్లు  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో నిర్మల్​లోని సోఫీ నగర్ వద్ద నిర్మించిన పెట్రోల్ బంకును మంగళవారం కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్​తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో విభిన్నమైన వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. రూ.కోటి 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బంక్ ద్వారా జీసీసీకి అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. జీసీసీ చైర్మన్ వాలియ నాయక్, జీఎం సీతారాం, ఎఫ్ఎస్ సీ ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్, స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మతిన్ తదితరులు పాల్గొన్నారు.

విజయ డైరీ ప్యాకింగ్ యూనిట్ కు శంకుస్థాపన

సోఫీ నగర్ లోని డైరీ కేంద్రంలో విజయ డైరీ పాల ప్యాకింగ్ యూనిట్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే మినరల్ మిక్సింగ్ యూనిట్ యంత్రాన్ని ప్రారంభించారు.  విజయ డైరీ చైర్మన్ సోమ భరత్ కుమార్, డైరీ అధికారి మధుసూదన్, డిస్ట్రిబ్యూటర్ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు

సారంగాపూర్: దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని మంత్రి అన్నారు. సారంగాపూర్​ మండలంలోని చించోలి(బి)లో  74 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నీటిలో కలెక్టర్ వరుణ్​రెడ్డితో కలిసి చేప పిల్లలను వదిలారు.  కులవృత్తులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.