జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జియా

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఆరున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు బయటకు వచ్చారు. నిజానికి నిన్ననే ఆమె విడుదల కావాల్సి ఉండగా.. పేపర్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో విడుదలలో ఆలస్యమైంది. 

షీనా బోరా హత్య  కేసులో ఇంద్రాణి ముఖర్జియా 2015 నుంచి ముంబై జైలులో ఉన్నారు. బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు సీబీఐ కోర్టును పలుమార్లు ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంద్రాణి ముఖర్జియా తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆమె ఆరున్నరేళ్లకుపైగా జైలులోనే ఉన్నారని, గత 11 నెలలుగా విచారణ ముందుకుసాగడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇన్నేళ్లు గడిచినా ఆమెకు పెరోల్ లభించలేదని, అందుకే సెక్షన్ 437 కింద విడుదల చేయాలని వాదించారు. రోహత్గి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేశారు. 2020లో విడుదలైన ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాకు విధించిన షరతులే ఆమెకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇంద్రాణి ముఖర్జియా మొదటి భర్త ద్వారా జన్మించిన షీనాబోరా 2012 ఏప్రిల్లో హత్యకు గురైంది. రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ సాయంతో ఇంద్రాణి తన కూతురు షీనాబోరాను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంద్రాణి తన మూడో భర్త పీటర్ ముఖర్జియా కుటుంబానికి షీనాను తన చెల్లెలిగా పరిచయం చేసింది. దీంతో పీటర్ మొదటి భార్య కొడుకైన రాహుల్ షీనాతో ప్రేమలో పడ్డారు. ఈ విషయం తెలియడంతో ఆగ్రహించిన ఇంద్రాణి కూతురును హత్య చేసినట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.