త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి ప్రమాణం

త్రిపుర గవర్నర్ గా  ఇంద్రసేనా రెడ్డి ప్రమాణం

హైదరాబాద్, వెలుగు:  త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర రాజధాని అగర్తలలోని రాజ్ భవన్ లో త్రిపుర హైకోర్టు సీజే జస్టిస్​ ఆపరేశ్ కుమార్ సింగ్ ఇంద్రసేనారెడ్డి చేత ప్రమాణం చేయించారు. తర్వాత రాజభవన్ లో సీఎం డాక్టర్ మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో నల్లు ఇంద్రసేనా రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సీఎం వివరించారు. సమావేశంలో నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

తనను గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు , కార్యకర్తలు, అభిమానులు ఇంద్రసేనా రెడ్డిని సత్కరించారు. బుధవారం త్రిపుర చేరుకున్న ఇంద్రసేనారెడ్డి దంపతులకు ఎయిర్ పోర్టులో ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సాహ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడ వారికి ‘గార్డ్ -ఆఫ్ -హానర్’ నిర్వహించారు.