
న్యూఢిల్లీ: మనదేశంలో ఈ ఏడాది జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 10 నెలల కనిష్ట స్థాయి 1.5 శాతానికి మందగించింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం, వర్షాల ముందస్తు రాకతో మైనింగ్, కరెంటు వంటి రంగాల్లో ఉత్పత్తి పడిపోయింది. ఫ్యాక్టరీల ఉత్పత్తిని కొలిచే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) గత జూన్‌లో 4.9 శాతం పెరిగింది.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటును గత నెలలో విడుదల చేసిన 1.2 శాతం అంచనా నుంచి 1.9 శాతానికి మార్చింది. ఆగస్టు 2024లో ఉత్పత్తి వృద్ధి స్థిరంగా నమోదయింది. నిర్వహణ రంగం ఉత్పత్తి వృద్ధి జూన్ 2025లో స్వల్పంగా పెరిగి 3.9 శాతానికి చేరుకుంది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో 3.5 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 10.3 శాతం వృద్ధితో పోలిస్తే మైనింగ్ ఉత్పత్తి 8.7 శాతం తగ్గింది. కరెంటు ఉత్పత్తి 2.6 శాతం తగ్గింది.