జీఎస్‌‌‌‌టీ రేట్లు తగ్గించడం ఎంతో మేలు

జీఎస్‌‌‌‌టీ రేట్లు తగ్గించడం ఎంతో మేలు
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న పారిశ్రామికవేత్తలు
  • టారిఫ్ ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చని వెల్లడి
  • ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్ధతుగా సంస్కరణలు
  • వినియోగం పెరుగుతుందని అంచనా


న్యూఢిల్లీ: కేంద్రం జీఎస్‌‌‌‌టీ రేట్లు తగ్గించడాన్ని పారిశ్రామికవేత్తలు  మెచ్చుకుంటున్నారు.    భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగం ఊపందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 22న  ప్రారంభమయ్యే నవరాత్రి రోజున కొత్త జీఎస్‌‌‌‌టీ పన్ను విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం స్లాబ్‌‌‌‌లు ఉండగా,  తాజాగా 12, 28 శాతం స్లాబ్‌‌‌‌లను ప్రభుత్వం తొలగించింది.  5శాతం, 18శాతం.. ఈ రెండు స్లాబ్‌‌‌‌లు మాత్రమే అమల్లో ఉంటాయి.

పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారంటే?
    
‘‘జీఎస్‌‌‌‌టీని సులభతరం చేయడంతో  క్లాసిఫికేషన్‌‌‌‌కు సంబంధించిన  వివాదాలు తగ్గుతాయి.  కంప్లయన్స్ (రూల్స్ పాటించడం)  మెరుగవుతుంది. ఇన్వర్టెడ్‌‌‌‌ డ్యూటీ స్ట్రక్చర్ సమస్యలు పరిష్కారమవుతాయి. రేట్లు తగ్గడంతో ప్రజలు  డబ్బులు ఆదా చేయగలుగుతారు. దీంతో  వినియోగం పెరుగుతుంది” అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)  అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ అన్నారు. తుది ఉత్పత్తిపై కంటే రా మెటీరియల్స్‌‌‌‌పై ఎక్కువ జీఎస్‌‌‌‌టీ పడడాన్ని ఇన్వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. 
    
పాల ఉత్పత్తులు, మందులు, రోజువారీ వస్తువులపై జీఎస్‌‌‌‌టీ  తగ్గడం, జీఎస్‌టీ ప్రాసెస్‌‌‌‌లో సంస్కరణలు, సంస్థల బలోపేతం.. ఇవన్నీ  మధ్య తరగతి, వినియోగదారులు, పరిశ్రమలకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఎకనామిక్ కౌన్సిల్ చైర్మన్ ఆర్. దినేష్ అభిప్రాయపడ్డారు. 
    
ఫ్లిప్‌‌‌‌కార్ట్ గ్రూప్ అధికారి రాజనీష్ కుమార్ ప్రకారం, పండుగ సీజన్ ముందు ఈ సంస్కరణలు అమలవడం వల్ల భారీగా వినియోగం పెరుగుతుంది.  మార్కెట్‌‌‌‌లో ప్రొడక్ట్‌‌‌‌లు మరింతగా అందుబాటులోకి వస్తాయి. తాజా జీఎస్‌‌‌‌టీ సంస్కరణతో “వికసిత భారత్” లక్ష్యాలను చేరుకోవచ్చు. 
    
ఈ సంస్కరణలు కార్మిక ఆధారిత పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తాయని ఫైనాన్షియల్ కంపెనీ ఇన్‌‌‌‌క్రెడ్‌‌‌‌ వెల్త్‌‌‌‌ సీఈఓ  నితిన్ రావు అన్నారు.  ఇటువంటి చర్యలు జీడీపీ వృద్ధికి గణనీయంగా దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. 
    
ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ  50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, తాజాగా జీఎస్‌‌‌‌టీని సులభతరం చేయడం వంటివి ఆర్థిక వృద్ధికి బలమైన ఊపునిస్తాయని ముత్తూట్ మైక్రోఫిన్ సీఈఓ  సదాఫ్ సయీద్ అన్నారు. రేట్ల తగ్గింపుతో  వినియోగం సహజంగా పెరుగుతుందని  అంచనా వేశారు. 
    
“భారత ఆర్థిక చరిత్రలో జీఎస్‌‌‌‌టీ అత్యంత ముఖ్యమైన సంస్కరణ. తాజా మార్పులు ఆర్థిక వ్యవస్థను  మరింత ముందుకు తీసుకెళ్తాయి” అని స్టాక్‌‌‌‌ఎక్స్చేంజ్‌‌‌‌  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.

‘‘జీఎస్‌టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తున్నాను.  ఇవి భారత ఆర్థిక వృద్ధికి పెద్ద ఊపునిస్తాయి. తాజా సంస్కరణలతో  వినియోగదారులపై ధరల భారం తగ్గుతుంది. వ్యాపారాలు సులభంగా జీఎస్‌టీని ప్రాసెస్ చేయగలుగుతాయి. ద్రవ్యోల్బణ నియంత్రణలో ఉంటుంది.  రిటైల్ రంగంలో వినియోగం పెరుగుతుంది. జీఎస్‌టీ అమలు మొదటి రోజు నుంచే పన్ను ప్రయోజనాలను  వినియోగదారులకు రిలయన్స్ రిటైల్ అందిస్తుంది”
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌

‘‘ఈ రేట్ల తగ్గింపుతో  వ్యవస్థలో  డిమాండ్‌‌‌‌ పెరుగుతుంది. మాక్రో ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంటుంది. అమెరికా వివిధ దేశాలపై ఇష్టానుసారంగా టారిఫ్‌‌‌‌లు వేస్తుండడంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిళ్ళలను ఎదుర్కొనేందుకు తాజా సంస్కరణలు సాయపడతాయి” 
- అశోక్ పి హిందూజా,  హిందూజా గ్రూప్ ఛైర్మన్

 “ఇంకా వేగవంతమైన సంస్కరణలు అవసరం. ఇవి వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయి. ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంది.  ప్రపంచంలో భారత్ స్థాయి బలపడుతుంది”


‌‌ - ఆనంద్ మహీంద్రా, 
మహీంద్రా గ్రూప్ చైర్మన్