దేశంలో ఏమూల చూసినా అసమానతే..!

దేశంలో ఏమూల చూసినా అసమానతే..!
  • ప్రభుత్వ శాఖల్లో సామాజిక అన్యాయం.. కీలక పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు చోటేది?
  • 90% జనాభాను 10% మంది శాసిస్తున్నరు: రాహుల్
  • మీడియాలోనూ ఇదే పరిస్థితి
  • దళితులు, ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నరు
  • భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్​ కామెంట్​

షాజాపూర్/ఉజ్జయిని: దేశంలో ఎక్కడా సామాజిక న్యాయం దొరకడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 90% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఏ ఒక్కరు కీలక పదవుల్లో లేరని తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్​లోని షాజాపూర్ సిటీలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

 ‘‘దేశంలో 50% జనాభా బ్యాక్​వర్డ్ క్లాసెస్ కింద ఉన్నారు. దళితులు 15% మంది, ఎస్టీలు 8% మంది, మైనారిటీలు 15% మంది ఉన్నారు. అంటే.. మొత్తంగా 90% జనాభా అన్నమాట.. 10% ఉన్న అగ్రవర్ణాలు.. 90% జనాభాను శాసిస్తున్నారు. 10 శాతంలో పారిశ్రామికవేత్తలే ఎక్కువ మంది ఉన్నరు. 90% వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో ఎవరూ కీలక పదవుల్లో లేరు. ఇలాంటి పరిస్థితే.. మీడియాలో కూడా ఉన్నది. వెనుకబడిన, దళిత, ఎస్టీ వర్గానికి చెందిన ఒక్క జర్నలిస్టు కూడా మీకు మీడియాలో కనిపించడు. టీవీ యాంకర్ల నుంచి మేనేజ్​మెంట్ దాకా అందరూ అగ్రవర్ణాలకు చెందినవారే..’’అని రాహుల్ విమర్శించారు. 

కీలక పదవుల్లో అగ్రవర్ణాలే..

బ్యూరోక్రసీలో కూడా సామాజిక న్యాయం అందడం లేదని రాహుల్ మండిపడ్డారు. దేశ బడ్జెట్ రూపకల్పనలో 90 మంది ఐఏఎస్​లు తమ వంతు పాత్ర పోషిస్తారని తెలిపారు. మధ్యప్రదేశ్​లో.. 60 నుంచి 70 మంది ఐఏఎస్​లు స్టేట్ బడ్జెట్​ను రూపొందిస్తారన్నారు. ఈ ఐఏఎస్​ల జాబితాలో కూడా 90శాతం జనాభా ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా ఉండరని విమర్శించారు. దేశంలో ఏ రంగంలో కూడా సామాజిక న్యాయం దొరకడం లేదన్నారు. ప్రైవేటు హాస్పిటల్ రంగంలో, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాల జాబితాలో 90% వర్గానికి చెందిన ఒక్కరు కూడా కనిపించరని తెలిపారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టాప్ పొజిషన్​లో అదానీ, అంబానీలు, 30 నుంచి 40 బ్యూరోక్రాట్లు కూర్చుకుంటారని విమర్శించారు.

మతం, కులం, భాష ప్రాతిపదికన విడదీస్తున్నరు

పట్వారీ, పోలీసు తదితర పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ లీక్​ల కారణంగా ఎంతోమంది పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారని రాహుల్ అన్నారు. ‘‘3% నుంచి 4% మంది ఉన్న వాళ్ల ఫోన్స్​లో ఎగ్జామ్ పేపర్లు కనిపిస్తుంటాయి. వాళ్లకు మాత్రమే జాబ్​లు వస్తుంటాయి. అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలను మతం, కులం, భాష పేరుతో విడదీస్తున్నది. ఘర్షణ వాతావరణం సృష్టించి వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా చేస్తున్నది’’ అని ఆరోపించారు. అక్కడి నుంచి ఉజ్జయినికి చేరుకున్న రాహుల్​కు మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్ ఘన స్వాగతం పలికారు. 

మహాకాళేశ్వరం ఆలయాన్ని రాహుల్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో మహిళలు, కార్మికులకు న్యాయం దొరకడం లేదు. ఇద్దరు.. ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. ఎయిర్​పోర్ట్​లో అదానీ.. వెపన్స్ తయారీలో అదానీ.. ఎక్కడ చూసినా అదానీనే కనిపిస్తున్నడు. సాధారణ వ్యక్తులకు అంత ఈజీగా దొరకని బ్యాంక్​ లోన్..  కొందరు ఇండస్ట్రియలిస్ట్​లకు మాత్రం నిమిషాల్లో మంజూరవుతుంది. కోట్ల లోన్లు మంజూరవుతున్నాయి’’ అని విమర్శించారు.

‘జై శ్రీరాం’ అనిపిస్తూ.. ఆకలితో చంపేయాలనుకుంటున్నరు

ప్రజలతో ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయిస్తూ.. వారు ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. యాత్రలో భాగంగా రాహుల్‌‌‌‌కు ‘మోదీ.. మోదీ.. జై శ్రీరాం’ అనే నినాదాలతో బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇది చూసిన రాహుల్.. వెహికల్ దిగి వారి వద్దకొచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రాహుల్​కు ఆలుగడ్డలు ఇచ్చి.. బంగారం చేయాలని కోరారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘జైశ్రీరాం నినాదాలు చేయిస్తూ మిమ్మల్ని ఆకలితో మోదీ చంపాలనుకుంటున్నారు’’అని విమర్శించారు. తర్వాత వెహికల్​పై నుంచి ఫ్లయింగ్ కిస్​లు ఇచ్చుకుంటూ ముందుకు కదిలారు.