మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఐదు నెలల చిన్నారి చనిపోయినట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శేఖర్ సోమవారం భార్య, ఇద్దరు కవల పిల్లలతో అంజన్న దర్శనం కోసం కొండగట్టు వచ్చాడు. కోనేరులో స్నానం చేసి, పిల్లలకు పాలు పట్టించి స్వామి వారి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లారు.
దర్శనం తర్వాత బయటకు వచ్చే సరికి ఇద్దరు పిల్లల్లో ఒక పాపకు ఎలాంటి స్పర్శ లేకపోవడంతో కొండ కిందికి చేరుకొని వైద్యుడికి చూపించారు. అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్ ధ్రువీకరించారు. పాప తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
