ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకం.. పసికందు మృతి

ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకం.. పసికందు మృతి
  • చలానా కట్టలేదని కారును అరగంట ఆపిన పోలీసులు
  • బాబును ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా వినలేదు: బాధితులు 
  • యాదాద్రి జిల్లాలో దారుణం

యాదగిరిగుట్ట, వెలుగు:పెండింగ్​ చలానా క్లియర్​ చేస్తేకానీ కారును వదిలేది లేదన్న ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకంతో ఓ పసికందు ప్రాణం గాలిలో కలిసింది. అరగంట పాటు కారును ఆపేయడంతో ఆస్పత్రికి చేరడంలో ఆలస్యమైంది. అప్పటికే ఆ పసివాడు చనిపోయాడు. యాదాద్రి జిల్లా వంగపల్లిలో మంగళవారం చోటుచేసుకుందీ విషాదం. పసికందు తల్లి చెప్పిన వివరాలు.. జనగాం జిల్లా మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు ఇటీవలే కొడుకు పుట్టిండు. కానుపు తర్వాత సరస్వతి వెంకిర్యాలలోని తన పుట్టింట్లో ఉంటోంది. పసికందుకు సుస్తి చేయడంతో మంగళవారం జనగాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. బాబు పరిస్థితి సీరియస్​గా ఉందని, వెంటనే హైదరాబాద్​లోని నీలోఫర్​ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు.

దీంతో ఓ కారు మాట్లాడుకుని బాబుతో పాటు ఆ దంపతులు హైదరాబాద్​కు బయల్దేరారు. వరంగల్​– హైదరాబాద్​ హైవేపై వంగపల్లి దగ్గర ట్రాఫిక్​ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. మల్లేశం దంపతులు ప్రయాణిస్తున్న కారుపై రూ.1000  పెండింగ్​ చలానా ఉంది. అది క్లియర్​ చేస్తే కానీ కారును వదలేదిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. బాబుకు ఆరోగ్యం బాలేదని, హైదరాబాద్​లోని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని బతిలాడినా వినిపించుకోలేదని సరస్వతి చెప్పారు. తెలిసిన వాళ్లకు ఫోన్​ చేసి, చలానా క్లియర్​ చేయించేదాకా విడిచిపెట్టలేదన్నారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా చలానా కోసం అరగంటపైనే తమ కారును ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నీలోఫర్​ ఆస్పత్రికి చేరుకునే సరికి ఆలస్యమైందని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు చెప్పారన్నారు. 

పోలీసులు ఆపడం వల్లే..

యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు కారును ఆపడం వల్లే తన కొడుకు చనిపోయాడని మీడియాకు సరస్వతి తెలిపారు. అరగంట ముందుగా తీసుకువస్తే బాబు బతికేవాడని డాక్టర్లు చెప్పారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బాబుకు సీరియస్ గా ఉందని, కారును వదిలిపెట్టాలని బతిమిలాడినా పోలీసులు కనికరించలేదని తెలిపారు. తన కొడుకు చావుకు పోలీసులే కారణమని బాలుడి తల్లి ఆరోపించారు.

ఆస్పత్రికి వెళ్తున్న కారును ఆపలే: ట్రాఫిక్ సీఐ

‘‘బాబును హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకువెళ్తున్న కారును ఆపలేదు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా అన్ని వాహనాలను ఆపాం. పెండింగ్ చలాన్లు ఉంటే పే చేయాలని డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టాం. చలానా కట్టే వరకు ఏ కారును ఆపలేదు. బాబుకు సీరియస్ గా ఉంది, కారులో హాస్పిటల్ కు తీసుకెళ్తున్నామని ఎవరూ మాకు చెప్పలేదు. ఆ తల్లి ఆరోపణల్లో నిజంలేదు” అని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదయ్య చెప్పారు.