మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు: బీజేపీలో చేరిన రెజ్లర్ యోగేశ్వర్

మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు: బీజేపీలో చేరిన రెజ్లర్ యోగేశ్వర్
  • బీజేపీలోకి ఇద్దరు ఆటగాళ్లు.. రెజ్లర్ యోగేశ్వర్ దత్, హాకీ టీం మాజీ కెప్టన్ సందీప్ సింగ్

న్యూఢిల్లీ: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీకి కొత్త బలం తోడైంది. గురువారం నాడు ఇద్దరు ఆటగాళ్లు ఆ పార్టీలో చేరారు. ఒలింపిక్ మెడలిస్ట్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ కాషాయం కండువా కప్పుకున్నారు. హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరలా సమక్షంలో వీరిద్దరితో పాటు అకాలీ దళ్ ఎమ్మెల్యే బాల్ కౌర్ సింగ్ కూడా బీజేపీలో చేరారు.

రాజకీయాల్లో మంచి చేయొచ్చని నిరూపించారు

ప్రధాని నరేంద్ర మోడీని చూసి తాను స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని రెజ్లర్ యోగేశ్వర్ దత్ చెప్పారు. రాజకీయాల్లో ఉండి మంచి చేయొచ్చని ఆయన నిరూపించారని అన్నారు. ఒక యువకుడిగా దేశానికి తన వంతు సేవ చేసేందుకు బీజేపీ సభ్యత్వం తీసుకున్నానని యోగేశ్వర్ చెప్పారు. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోడీని చూసి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని యోగేశ్వర్ చెప్పారు.

 

పార్టీ చెబితే పోటీ చేస్తా: సందీప్ సింగ్

ప్రధాని మోడీ నుంచి స్ఫూర్తి పొంది తాను రాజకీయాల్లోకి వచ్చానని భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ చెప్పారు. ఆయన నిజాయితీ తనను బీజేపీలో చేరేలా చేసిందన్నారు. ప్రధాని, హర్యానా సీఎం.. ఇద్దరూ యువతకు చాలా మంచి చేస్తున్నారని సందీప్ సింగ్ అన్నారు. పార్టీ తనను సమర్థుడిగా గుర్తించి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.