హెచ్3ఎన్2 వైరస్​తో జాగ్రత్త

హెచ్3ఎన్2 వైరస్​తో జాగ్రత్త

కరోనా లెక్కనే విస్తరిస్తోంది
ఢిల్లీ ఎయిమ్స్​ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా
మాస్కులు పెట్టుకోవాలని, వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచన

న్యూఢిల్లీ : హెచ్3ఎన్2 వైరస్​ కారణంగా ఇన్​ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయని, కరోనా మాదిరిగానే విస్తరిస్తోందని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్​ డాక్టర్ రణ్​దీప్​ గులేరియా చెప్పారు. ఏటా ఈ సమయంలో వైరస్​ మార్పులు చెందుతోందని, డ్రాప్లెట్స్​ ద్వారా విస్తరిస్తోందన్నారు. పండగల సీజన్​ మొదలుకావడంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ముసలివారు, కోమర్బిడ్ పరిస్థితులు కలిగి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరంతో పాటు గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు మొదలైన లక్షణాలతో ఇన్​ఫ్లుయెంజా కేసులు నమోదవుతున్నాయని గులేరియా చెప్పారు. వైరస్ మార్పు చెందడం, దానిపై ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడమే దీనికి కారణమన్నారు. 

ఏటా మారుతోంది..

‘‘చాలా ఏండ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్​వచ్చింది. ఆ వైరస్ పరిణామం చెందుతూ ఇప్పుడు హెచ్3ఎన్2గా మారింది. ఇది సాధారణ ఇన్‌ఫ్లుయెంజా స్టెయిన్. కానీ మనం ఎక్కువ కేసులను చూస్తున్నామంటే దానికి కారణం వైరస్ కొద్దికొద్దిగా మార్పు చెందుతోంది. రోగనిరోధక శక్తి కొంచెం తగ్గుతోంది. అందువల్ల కోమార్బిడ్​ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు సులభంగా ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నారు”అని గులేరియా చెప్పారు. కేసులు పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితులు మాత్రం తక్కువగానే ఉన్నాయని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని గులేరియా చెప్పారు.

వాతావరణ మార్పులు, మాస్కులు వాడకపోవడం వల్లే

ఇన్​ఫ్లుయెంజా కేసులు పెరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని, ఒకటి ఏటా ఈ సమయంలో వాతావరణం మారుతూ ఉంటుందని, ఇది కూడా వైరస్​లో మార్పులకు ఒక కారణమని, అలాగే కరోనా తర్వాత జనం మాస్కులను వాడటం మానేశారని, దీని వల్ల కూడా వైరస్​ బారిన పడుతున్నారని చెప్పారు. హెచ్3ఎన్2 వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్​ను ధరించాలని, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, ఫిజికల్​ డిస్టెన్స్​ను పాటించాలని సూచించారు. ఈ వైరస్​ సోకి హైరిస్క్​లో ఉన్న వారు.. ముసలివారికి వ్యాక్సిన్​ అందుబాటులో ఉందని చెప్పారు. ముసలి వారితో పాటు శ్వాస సంబంధిత రోగాలు, గుండె సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్​ చేయించుకునే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

ఏమిటీ హెచ్3ఎన్2 వైరస్?

హెచ్3ఎన్2 అనేది ఒక ఇన్​ఫ్లుయెంజా వైరస్. దీనినే ఇన్ ఫ్లుయెంజా ఏ వైరస్​ అని కూడా పిలుస్తారు. ఇది శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రతి ఏటా అనారోగ్యాలను కలిగిస్తుంది. మనుషుల్లో ఇన్​ఫ్లుయెంజా ఏ వైరస్ సబ్​ టైప్​లను 1968లో గుర్తించారు. ఇన్ ఫ్లుయెంజా ఏ వైరస్.. హెమాగ్లుటినిన్(హెచ్ఏ), న్యూరామినిడేస్ (ఎన్ఏ) ప్రోటీన్ జాతుల నుంచి వచ్చింది. హెచ్ఏలో 18కిపైగా విభిన్న సబ్​ టైప్స్ ఉన్నాయి. వీటిని హెచ్1 నుంచి హెచ్18గా పిలుస్తుంటారు. అలాగే ఎన్ఏకి 11 విభిన్న సబ్​ టైప్స్ ఉన్నాయి. వీటిని ఎన్ఏ నుంచి ఎన్11గా పిలుస్తారు. హెచ్3ఎన్2 అనేది ఇన్​ఫ్లుయెంజా ఏ వైరస్ రెండు ప్రోటీన్ జాతుల కలయిక.

హెచ్3ఎన్2 ఇన్​ఫ్లుయెంజా వైరస్​పై ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు అన్నారు. ‘వెలుగు’తో  మంగళవారం ఆయన మాట్లాడారు. హెచ్3ఎన్2 వైరస్ 2, 3 రోజుల్లో తగ్గిపోయినప్పటికీ దగ్గు మాత్రం కొన్ని వారాల పాటు ఉంటుందన్నారు. ఓరల్ ప్లూయిడ్స్, పారాసిటమాల్  గోలీలు,  మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని, యాంటీబయాటిక్స్ వాడవద్దన్నారు. 

హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు ఇవీ..

జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒంటి నొప్పులు, చలి, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం.

నియంత్రణ ఎలా?

ఏ వైరస్​ అయినా రాకుండా ఉండాలంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమ మార్గం. అలాగే వైరల్​ ఇన్​ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అనారోగ్యంతో ఉండే వారికి దూరంగా ఉండాలి. మాస్క్​ను తప్పనిసరిగా పెట్టుకోవాలి. వైరల్​ ఇన్ ఫెక్షన్లు సులువుగా వ్యాపిస్తాయి కాబట్టి దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోటికి చేతిని అడ్డుపెట్టుకోవాలి. ఎక్కువగా ఫ్లూయిడ్స్​ తీసుకోవాలి. జ్వరం, దగ్గు, తలనొప్పి మొదలైనవి వచ్చినప్పుడు తప్పకుండా మెడిసిన్​ తీసుకోవాలి. అప్పుడే ఈ సింప్టమ్స్​ నుంచి త్వరగా బయటపడగలం. ఇన్​ఫ్లుయెంజా వైరస్​ కు ఇచ్చే టీకాలను తీసుకోవడం ద్వారా కూడా వైరస్​ బారిన పడకుండా ఉండొచ్చు. ఒకవేళ సింప్టమ్స్​ తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి.