
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.7,033 కోట్ల నికరలాభం సాధించింది. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.7,969 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం తక్కువ. ఈసారి కంపెనీకి రూ.40,925 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.37,923 కోట్లతో పోలిస్తే 8శాతం ఎక్కువ.
సీక్వెన్షియల్‌గా నికర లాభం 3.3శాతం పెరిగింది. గత క్వార్టర్లో రూ.6,806 కోట్లు వచ్చాయి. ఆదాయం రూ.41,764 కోట్ల నుంచి 2శాతం తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 1.8 శాతం పెరిగి రూ.26,713 కోట్లకు చేరుకుంది. ఆదాయం ఆరు శాతం వృద్ధితో రూ.1.62 లక్షలకు కోట్లకు ఎగిసింది. స్థిర కరెన్సీలో 0–3శాతం ఆదాయ వృద్ధిని, 20శాతం–22శాతం నిర్వహణ మార్జిన్‌ను కంపెనీ అంచనా వేసింది. ఈసారి ఆపరేటింగ్ మార్జిన్ 21 శాతంగా నమోదయింది. ప్రతి షేరుకు రూ.22 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లించడానికి ఇన్ఫోసిస్ బోర్డు అంగీకరించింది.