- నాలుగో క్వార్టర్లో అదరగొట్టిన ఇన్ఫోసిస్.. రూ.8,501 కోట్ల లాభం
- నాలుగో క్వార్టర్లో రూ.8,501 కోట్ల లాభం
- వార్షికంగా లాభం 21 శాతం జంప్
- మొత్తం ఆదాయం రూ.40 ,925 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 2026 మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.8,501 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇన్ఫోసిస్‌కు రూ.7,033 కోట్ల లాభం వచ్చింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.46,402 కోట్లకు చేరుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఆదాయం రూ.40,925 కోట్లుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ లాభం రూ.6,654 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 28 శాతం పెరిగింది. ఆదాయం కూడా క్రితం క్వార్టర్ కంటే రెండు శాతం అధికంగా నమోదైంది. అప్పుడు ఆదాయం రూ.45,479 కోట్లుగా ఉంది.
భారీ డివిడెండ్ ప్రకటన
పెట్టుబడిదారులకు ఇన్ఫోసిస్ తీపి కబురు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.25 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన రికార్డు తేదీని జూన్ 10గా నిర్ణయించింది. అర్హులైన వాటాదారులకు జూన్ 25న డివిడెండ్ సొమ్ము అందుతుంది. కంపెనీ తన 45వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ( ఏజీఎం) జూన్ 23న నిర్వహించనుంది. 2027 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి అంచనాలను కంపెనీ 1.5 శాతం నుంచి 3.5 శాతంగా పేర్కొంది. ఆపరేటింగ్ మార్జిన్ 20 శాతం నుంచి 22 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.
20 వేల మంది ఫ్రెషర్లకు జాబ్స్
2026 ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకోవాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,594కి చేరింది. తద్వారా దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. తాజా నియామకాల్లో భాగంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేయనుంది. ఈ భారీ రిక్రూట్‌మెంట్ ద్వారా డిజిటల్, క్లౌడ్, ఏఐ ఆధారిత సేవల్లో తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

