ఇన్ఫోసిస్ పై ఎస్‌ఈసీ దర్యాప్తు

ఇన్ఫోసిస్ పై ఎస్‌ఈసీ దర్యాప్తు
  • అడిగిన వివరాలన్నీ ఇస్తాం
  • దర్యాప్తుకు సహకరిస్తాం
  • సెబీ కోరిన వివరాలూ ఇస్తాం
  • ఇన్ఫోసిస్‌‌ ప్రకటన
  • సీఈఓ, సీఎఫ్‌‌ఓలను ఇంటికే ?

బెంగళూరు: విజిల్‌‌ బ్లోయర్‌‌ కంప్లెయింట్లపై యూఎస్‌‌ సెక్యూరిటీస్‌‌ అండ్‌‌ ఎక్స్చేంజ్‌‌ కమిషన్‌‌ (ఎస్‌‌ఈసీ) దర్యాప్తు మొదలైనట్లు ఇన్ఫోసిస్‌‌ లిమిటెడ్‌‌ గురువారం స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌లకు సమాచారం ఇచ్చింది. ఎస్‌‌ఈసీతో మాట్లాడుతున్నామని, దర్యాప్తు మొదలైనట్లు తమకు తెలిసిందని కంపెనీ పేర్కొంది. ఇన్ఫోసిస్‌‌ ఏడీఆర్‌‌లు యూఎస్‌‌ స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌లో ట్రేడవుతుండటంతో ఎస్‌‌ఈసీ ఈ దర్యాప్తు చేపట్టింది. విజిల్‌‌ బ్లోయర్ల కంప్లెయింట్స్‌‌ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌‌ ఏడీఆర్‌‌లు భారీగా పతనమవడంతోనే ఈ దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఎస్‌‌ఈసీ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని ఇన్ఫోసిస్‌‌ స్పష్టం చేసింది. ఈ విజిల్‌‌ బ్లోయర్ కంప్లెయింట్స్‌‌పై సెబీ కూడా అదనపు సమాచారాన్ని అడిగిందని, ఆ సమాచారం అందిస్తామని ఇన్ఫోసిస్‌‌ వెల్లడించింది.

అమెరికాలో ఇదే విషయంలో ఫెడరల్‌‌ కోర్టులో  క్లాస్‌‌ యాక్షన్‌‌ సూట్‌‌ దాఖలైందనేది తమ దృష్టికి వచ్చిందని ఇన్ఫోసిస్‌‌ తెలిపింది. ఈ కేసులో ఆత్మరక్షణ కోసం అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు పేర్కొంది.  ఇన్ఫోసిస్‌‌ ఈ ప్రకటన నేపథ్యంలో షేర్‌‌ ధర బీఎస్‌‌ఈలో గురువారం 2.36 శాతం తగ్గి రూ. 635.40 వద్ద ముగిసింది. విజిల్‌‌ బ్లోయర్‌‌ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా సీఈఓ సలీల్‌‌ పరేఖ్‌‌, సీఎఫ్‌‌ఓ నీలాంజన్‌‌ రాయ్‌‌లను ఇన్ఫోసిస్‌‌  ఇంటికి పంపించే అవకాశాలున్నాయని ఎనలిస్టు ఒకరు చెప్పారు.

దర్యాప్తులో సహకారానికి మాజీ సీఎఫ్‌‌ఓ, ఎండీ రంగనాథ్‌‌, డిప్యూటీ సీఎఫ్‌‌ఓ జయేష్‌‌ సంఘ్రాజ్కల సహకారం కూడా కంపెనీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన ప్రతిష్టను కాపాడుకునేందుకు సీఈఓ, సీఎఫ్‌‌ఓలను వైదొలగమని కంపెనీ అడగొచ్చని బెంగళూరుకు చెందిన ఐటి ఎనలిస్టు ఒకరు తెలిపారు. ఇదిలావుంటే, మరోవైపు ముందే ఎందుకు చెప్పలేదనే బీఎస్‌‌ఈ ప్రశ్నకు కూడా ఇన్ఫోసిస్‌‌ బదులిచ్చింది. సాధారణమైన కంప్లెయింట్‌‌ కాబట్టి, ఆడిట్‌‌ కమిటీ దర్యాప్తు తేలాక ఆ వివరాలను తెలియ చేద్దామనుకున్నామని సమాధానమిచ్చింది. వివిధ మీడియా సంస్థలు అడగడం వల్లే అక్టోబర్‌‌ 22 నాటి డిస్‌‌క్లోజర్‌‌ ఇచ్చామని,  ఎల్‌‌ఓడీఆర్‌‌ నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తామని ఇన్ఫోసిస్‌‌ వెల్లడించింది.

ఎన్‌ఎఫ్ఆర్‌ఏ దర్యాప్తూ …

న్యూఢిల్లీ : ఆడిటింగ్‌పరమైన అంశాల స్వతంత్ర విచారణకు ఏర్పాటైన నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌తోపాటు ఇన్ఫోసిస్‌ దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన నిపుణుల కోసం ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ప్రారంభమైందని ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏకు మాజీ ఐఏఎస్‌ అధికారి రంగాచారి శ్రీధరన్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అకౌంటింగ్‌ పరమైన అవకతవకలు జరిగినప్పుడు ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంటుంది. లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ పబ్లిక్‌ కంపెనీలన్నీ ఎన్‌ఎఫ్ఆర్‌ఏ పరిధిలోకి వస్తాయని ఆ ఉన్నతాధికారి వెల్లడించారు.

Infosys: SEC has initiated investigation into whistleblower complaint