ఓవైపు దళిత బంధు అంటూనే.. ప్రమోషన్లలో అన్యాయం

ఓవైపు దళిత బంధు అంటూనే.. ప్రమోషన్లలో అన్యాయం
  • ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ల ప్రమోషన్లకు గండి
  • ఓవైపు దళిత బంధు అంటూ.. మరోవైపు ప్రమోషన్లలో రాష్ట్ర సర్కార్ అన్యాయం
  • పార్లమెంటులో తొలగించిన ‘క్యాచ్ ఆఫ్​ రూల్’ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం 
  • రిజర్వేషన్​లో ప్రమోషన్​ వస్తే.. జనరల్​ సీనియారిటీ వర్తించదంటూ గెజిట్  
  • రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది దళిత ఉద్యోగులపై ప్రభావం 

హైదరాబాద్, వెలుగు: దళిత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యం లేని పదవులను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆఫీసర్ల ప్రమోషన్లకూ గండికొడుతోంది. రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్లు వచ్చిన ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లకు.. ఆ తర్వాత ప్రమోషన్​కు జనరల్ సీనియారిటీ (కాన్​సీక్వెన్సియల్) వర్తించదని ప్రభుత్వం గెజిట్​నోటిఫికేషన్ ఇచ్చింది. తొలుత రాష్ట్ర సెక్రటేరియేట్​లో ఈ ఉత్తర్వులను అమలు చేసి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. సెక్రటేరియట్​లో పనిచేస్తున్న 300 మంది, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై ఈ గెజిట్​ప్రభావం పడుతుంది. ఒకవైపు దళితులు ఎదగాలని, దళిత బంధు  పథకమని అంటున్న రాష్ట్ర సర్కార్.. తమ ప్రమోషన్లను అడ్డుకునే ప్రయత్నం చేయడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించిన క్యాచ్ ఆఫ్​ రూల్ విధానాన్ని మళ్లీ తెరపైకి తేవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు ప్రమోషన్లు రావని, ఏ పోస్టుల్లో ఉన్న దళిత ఉద్యోగులు ఆ పోస్టుల్లోనే రిటైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నరు. కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీ అమలు చేయాలని కోర్టు తీర్పులు ఉన్నా, వాటికి విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎస్‌‌ను కలిసేందుకు ప్రయత్నించినా, స్పందించడం లేదని ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ల సంఘాల నాయకులు చెప్తున్నారు. 

కోర్టుకు ఒకటి చెప్పి, గెజిట్ లో మరోటి 
85వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అధికారాన్ని వాడుకుని ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కాన్​సీక్వెన్షియల్‌‌ సీనియారిటీ వర్తింపజేయాలని ఉమ్మడి ఏపీలో జీఓ నెంబర్ 26ను జారీ చేశారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్​ఇచ్చారు. జీవో 26 ఎస్సీ, ఎస్టీలకు వర్తిస్తుందని 2018లోనే హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది అమలు కావడం లేదంటూ నవీన్ రావు అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో కాన్ సీక్వెన్సియల్ సీనియారిటీ అమలు చేస్తున్నామని, ఎక్కడైనా దళిత ఆఫీసర్లకు అన్యాయం జరిగితే పరిశీలిస్తామని సీఎస్ సోమేశ్‌‌కుమార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి విరుద్ధంగా జులై 24న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి దాని అమలుకు మెమో 73ను కూడా జారీ చేశారు. ఇందులో 2001లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో తొలగించిన క్యాచ్ ఆఫ్​రూల్ విధానాన్ని పరోక్షంగా ప్రవేశపెట్టారు.   

ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లకు నష్టం 
క్యాచ్ ఆఫ్​ రూల్ తొలగించిన తరువాత రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్​ వచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగికి ఆ రోజు నుంచే కాన్‌‌సీక్వెన్షియల్ ​సీనియారిటీ వర్తిస్తుంది. ఇతర ఉద్యోగుల మాదిరి పైస్థాయి ప్రమోషన్లకు అర్హులు అవుతారు. ప్రమోషన్ వచ్చే స్థానంలో అంతకు ముందే ఒక్క ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ ఉన్నా మిగతా వారికి ప్రమోషన్​ ఇవ్వకుండా ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఆ ఆఫీసర్ ఇక ఎప్పటికీ అదే పోస్టులోనే కొనసాగాల్సి ఉంటుంది.   

నలుగురు డిమోట్? 
కొత్త గెజిట్ ప్రకారం కాన్​సీక్వెన్షియల్ సీనియారిటీ కాకుండా ఇనీషియల్ సీనియారిటీ పరిగణనలోకి తీసుకుంటే అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న నలుగురు ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లు డిమోట్ కావాల్సి ఉంటుంది. నోటీసులు అందడంతో వీరు ఆందోళనకు గురవుతున్నరు. ఎస్సీ డెవలప్‌‌మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అంశాలను, గత జీఓలు, కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చారంటున్నారు. 

ఎస్సీ ఆఫీసర్లను అణిచేస్తున్నరు 
ప్రమోషన్లలో అగ్ర కులాల ఆఫీసర్లనే అందలం ఎక్కిస్తున్నరు. ప్రమోషన్ లిస్టు తయారు చేసేది వారే. ఎస్సీలకు అర్హత ఉన్నా ఏదో సాకు చెప్తూ, కింది స్థాయి పోస్టులకే పరి మితం చేస్తున్నరు. ఇప్పుడు తెచ్చిన గెజిట్​ నోటిఫికేషన్ ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ల ప్రమోషన్లకు మరింత అడ్డంకిగా మారుతుంది. దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ఉన్నా దళిత ఆఫీసర్లకు అన్యాయం చేసేలా ఉత్తర్వులు తెచ్చారు. ఒక వైపు దళిత బంధు అంటూ.. మరోవైపు  దళిత ఆఫీసర్లను అణిచేసే ప్రయత్నం చేస్తున్నరు.   
- దుపాక సుభద్ర, రిటైర్డ్ అడిషనల్ ​సెక్రటరీ (సెక్రటేరియట్)​