అన్ని సౌకర్యాలతో మక్తల్లో స్టేడియాన్ని నిర్మిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

అన్ని సౌకర్యాలతో  మక్తల్లో స్టేడియాన్ని నిర్మిస్తాం :  మంత్రి వాకిటి శ్రీహరి
  •     మంత్రి వాకిటి శ్రీహరి 

మక్తల్, వెలుగు: మక్తల్ పట్టణంలో రూ.5 కోట్లతో   అన్ని  సౌకర్యాలతో స్టేడియం నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం మంత్రి అధికారులతో కలిసి స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలో క్రీడాకారులు ఉన్నప్పటికీ స్టేడియం లేకపోవడంతో వారు రాణించలేకపోతున్నారన్నారు.   నూతన స్టేడియం నమూనాను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 

అనంతరం  పట్టణంలోని పలు అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యతను మంత్రి పరిశీలించారు. నాణ్యతలో రాజీపడితే సహించబోమని హెచ్చరించారు. అనంతరం ట్యాంక్‌‌బండ్ సుందరీకరణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఏఈ నాగశివ మాట్లాడుతూ గతంలో మంజూరైన రూ.3 కోట్లతో అన్ని పనులు పూర్తి చేయడం సాధ్యం కాదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదనంగా రూ.2.50 కోట్ల నిధులు అవసరమని చెప్పాగా..  ఎస్టిమేట్ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. 

ఈదమ్మ దేవాలయం సమీపంలో బోటింగ్‌‌కు అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నారు. అంతరాష్ట్ర రహదారి ప్రయాణికులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలని, సులభ్ కాంప్లెక్స్, క్యాంటీన్​, చిన్నపిల్లల ప్లే గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ట్యాంక్‌‌బండ్‌‌పై కిలోమీటర్ వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, వినాయక నిమజ్జన ఘాట్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

మేయిన్ రోడ్డు నుంచి నిమజ్జన స్థలానికి వెళ్లే రోడ్డును విస్తరించాలన్నారు.   పట్టణంలోని పలు కాలనీల్లో సుడిగాలి పర్యటన  చేశారు.   16వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్‌‌కుమార్, కోళ్ల వెంకటేష్, శ్రీనివాస్, కావాలి తాయప్ప, వాకిటి శ్యామ్, నాగరాజు, సాలంబిన్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.