ఆ గ్రామాలను ఏపీలో కలపడంతో తీవ్ర అన్యాయం జరిగింది

ఆ గ్రామాలను ఏపీలో కలపడంతో తీవ్ర అన్యాయం జరిగింది
  • గవర్నర్ కు ఎమ్మెల్యే పొదెం వీరయ్య విజ్ఞప్తి
  • ఏపీ ముంపు గ్రామాల సర్పంచులతో కలిసి వినతిపత్రం 

హైదరాబాద్, వెలుగు: భద్రాచలానికి ఆనుకుని ఉండి, గోదావరి వరద ముంపునకు గురైన ఏపీకి చెందిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని గవర్నర్ తమిళిసైని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. ఆదివారం ఆయన వరద ముంపు గ్రామాల సర్పంచ్ లతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గవర్నర్ ను కలిసిన తర్వాత వీరయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో రెడ్డిపాక, గుండాల, పురుషోత్తం పట్నం, పిచ్చుకల పాడు, కన్నయగూడెం గ్రామాలను ఏపీలో కలిపారని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని గవర్నర్ ను కోరామని  తెలిపారు. తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు కేంద్రంతో మాట్లాడతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందన్నారు. ఇటీవల గోదావరి ముంపు గ్రామాల్లో పర్యటించినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పామన్నారు. తమ గ్రామాలను ఏపీలో కలపడంతో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. తాము భద్రాచలానికి అరకిలోమీటర్ దూరంలోనే ఉన్నామని, తమ చుట్టూ తెలంగాణ ఉన్నా.. తాము ఏపీలో ఉన్నామన్నారు.