- బీఆర్ఎస్ అవినీతి చిట్టా మొత్తం ఆమె వద్దే ఉంది: రాంచందర్ రావు
- పంపకాల్లో తేడా వచ్చి పార్టీ నుంచి బయటికి
- ప్రజా సేవ కోసం కాదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వెంటనే ఎంక్వైరీ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కవితకు బీఆర్ఎస్ గుట్టు మొత్తం తెలుసని, కమిషన్ ముందు ఆమెను కూడా విచారించి ఆధారాలు రాబట్టాలన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రావడానికి కారణం ప్రజాసేవ కాదు. కేవలం వాటాలు కుదరకపోవడమే. ఇన్నాళ్లు వాళ్లతోనే ఉండి, అధికారాన్ని అనుభవించినప్పుడు లేని ఆత్మగౌరవం.. వాటాలు తేడా రాగానే గుర్తొచ్చిందా? ఆత్మగౌరవం కవితకు మాత్రమే ఉంటుందా? ప్రజలకు ఉండదా?’’అని రాంచందర్ రావు నిలదీశారు.
ఆ పేరు చూసే ఓర్వలేకపోతున్నారు..
కేంద్రం తెచ్చిన చట్టంలో ‘శ్రీరామ్’ పేరు వినిపి స్తుందనే కాంగ్రెస్ పార్టీకి అంత అక్కసు అని రాం చందర్ రావు విమర్శించారు. ‘‘వికసిత్ భారత్ అన్నా.. శ్రీరామ్ అన్నా కాంగ్రెస్‌కు ఎందుకంత ద్వేషం? గాంధీజీ కలలు కన్న రామరాజ్యం దిశగా ఈ చట్టం అడుగులు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు”అని రాంచందర్ రావు అన్నారు.
బూత్ అధ్యక్షుడే సుప్రీం..
బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి కంటే బూత్ అధ్యక్షుడే పార్టీకి కీలకమని రాంచందర్ రావు అన్నారు. పార్టీ ఆఫీస్‌లో జరిగిన ‘బూత్ నిర్మాణ్ అభియాన్’ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జ్‌ల నియామకం
బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. దీనిలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ప్రతి మున్సిపల్ ఏరియాకు ఇంచార్జ్‌లను నియమించాలని, ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సమన్వయ కమిటీలతో పాటు ‘స్టేట్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతం రావు తెలిపారు.
