- జమ్మికుంట సప్తగిరి హాస్పిటల్ లో సీఐడీ సోదాలు
జమ్మికుంట, వెలుగు : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి హాస్పిటల్ లో మంగళవారం సీఐడీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ స్వాహా చేసిన ఘటనలో రాష్ట్రవ్యాప్తంగా 17 హాస్పిటళ్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆఫీసర్లు రికార్డులు పరిశీలించారు. ఒకే పేషెంట్ ఐడీపై ఇద్దరికి బిల్లులు ఇచ్చినట్టు గుర్తించారు. ఇందులో హాస్పిటల్ పీఆర్వో సంతోష్ కీలకపాత్ర పోషించినట్లు నిర్ధారణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆయన హాస్పిటల్ లో వినియోగించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్న పేషెంట్లకు డాక్టర్ ఒరిజనల్ బిల్లులు ఇవ్వగా.. కొద్ది రోజుల తర్వాత ఆ పేషెంట్ల ఐడీ నంబర్ల తోనే హాస్పిటల్ పీఆర్వో ఇతరులకు బిల్లులు ఇచ్చి సీఎంఆర్ఎఫ్ సాయం పొందడానికి సహకరించినట్లు తెలిసింది. ఇలా ఎంత మందికి బిల్లులు ఇచ్చారనే విషయం తెలుసుకునేందుకు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సీఎంఆర్ఎఫ్ సాయంలో సంతోష్ వాటా ఎంత ? లీడర్ల పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.