‘ఐఎన్ఎస్ విక్రాంత్’ ప్రత్యేకతలు 

‘ఐఎన్ఎస్ విక్రాంత్’ ప్రత్యేకతలు 

భారతీయుడి ఆత్మ నిర్భరతకు, మేథస్సుకు ప్రతీకగా ఐఎన్ఎస్- విక్రాంత్ నిలవనుంది. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక.. INS విక్రాంత్ పేరునే దీనికి పెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక.. గంటకు గరిష్ఠంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లవచ్చు. 45వేల టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, మిసైల్స్ ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు గాల్లోకి ఎగిరి, టార్గెట్ ని ఛేదించి తిరిగి వచ్చేలా దీంట్లో ఏర్పాట్లు చేశారు.  

ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీ 2005లో కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో ప్రారంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్  ఈ నౌక తయారీకి అవసరమైన ఉక్కు అందించేందుకు సిద్ధమైంది. విక్రాంత్ రూపకల్పనలో స్టీల్ అథారిటీ ఆఫ్  ఇండియాతో పాటు బీహెచ్ఈఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ అండ్ టీ లాంటి ప్రైవేటు సంస్థలు సహా 100 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరికరాలను తయారు చేసి ఇచ్చాయి.

INS విక్రాంత్ తయారీకి రెండు వేల మంది సెయిల్ ఉద్యోగులు పని చేయగా, మరో 13వేల మంది బయట శ్రమించారు. హైదరాబాద్  సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి. 76 శాతం భారతీయ సాంకేతికతనే దీని తయారీకి వాడారు. విక్రాంత్  తయారీకి మొత్తం రూ.20 వేల కోట్ల ఖర్చయ్యింది.

INS విక్రాంత్ లో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలో భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్న హాస్పిటల్ ని నిర్మించారు. అలాగే రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్ మెషీన్ ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు వైద్యాధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పని చేస్తారు. నౌకలో ఫ్రైట్ డెక్ పరిమాణం 12 వేల 500 చదరపు మీటర్లుగా ఉంది. ఒకేసారి 12 యుద్ధ విమానాలు, ఆరు హెలికాప్టర్లను ఆపరేట్ చేయవచ్చు. మహిళా అధికారుల కోసం కూడా ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి.

విక్రాంత్  లోపల దాదాపు 2,300 కంపార్ట్ మెంట్లను నిర్మించారు. లోపల ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. సముద్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులకు సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎయిర్  కండీషనింగ్  వ్యవస్థను ఏర్పాటు చేశారు.

గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ
ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్‌ కాంప్లెక్స్, ఐసోలేషన్‌ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్‌ కాంప్లెక్స్‌ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్‌ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్‌ ఆఫీసర్లు, 17 మంది మెడికల్‌ సెయిలర్స్‌ ఉంటారు. ఇక దీని కిచెన్‌ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి.