విజిలెన్స్‌‌ తనిఖీలు .. మూడు రోజులు.. 29 గంటలు!

 విజిలెన్స్‌‌ తనిఖీలు ..  మూడు రోజులు.. 29 గంటలు!

 

  • కాళేశ్వరంపై భూపాలపల్లి జిల్లాలో 
  • పూర్తయిన విజిలెన్స్‌‌ తనిఖీలుసీజ్ చేసిన ఫైల్స్‌‌‌‌తో 
  • నిండిపోయిన బొలెరో వెహికల్‌‌
  • ఫైల్స్‌‌‌‌ కట్టలపై ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్ల పేర్లు
  • హైదరాబాద్‌‌‌‌లోని హెడ్ ఆఫీస్‌‌కు తరలింపు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పనుల్లో జరిగిన అక్రమాలను తెలుసుకోవడానికి జిల్లాలో విజిలెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు చేపట్టిన తనిఖీలు గురువారం పూర్తయ్యాయి. మూడు రోజుల్లో 29 గంటల పాటు సోదాలు చేసి.. అవసరమైన రికార్డులను సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. విజిలెన్స్‌‌‌‌ ఎస్పీ రమేశ్‌‌‌‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భూపాలపల్లి జిల్లాకు వచ్చిన విజిలెన్స్‌‌‌‌ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ బృందాలు గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిపోయాయి. ఆఫీసర్లు సీజ్‌‌‌‌ చేసిన కాళేశ్వరం ఫైల్స్‌‌‌‌‌‌‌‌తో బొలెరో వెహికల్ నిండిపోయింది. కాళేశ్వరం పనులకు సంబంధించి వివిధ కేటగిరీల వారీగా తెల్లగుడ్డలతో కట్టిన ఫైల్స్‌‌‌‌‌‌‌‌ కట్టలపై ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల పేర్లు రాయడం గమనార్హం. ముఖ్యమైన రికార్డులు, డాక్యుమెంట్లు సీజ్‌‌‌‌‌‌‌‌ చేశామని ఎస్పీ రమేశ్‌‌‌‌‌‌‌‌ గురువారం మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ప్రకటించారు. ఈ ఫైల్స్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హెడ్ ఆఫీస్‌‌‌‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ఏఈ, డీఈ, ఈఈల వారీగా విభజించి..

రాష్ట్ర సర్కారు ఆదేశాలతో మంగళవారం భూపాలపల్లి జిల్లాలో అడుగుపెట్టిన విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బృందాలు.. అదే రోజు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌, మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ల్లో ఏకకాలంలో తనిఖీలు చేశాయి. సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి తమకు అవసరమైన ఫైల్స్‌‌‌‌‌‌‌‌ను రెండు కార్లలో మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడే రాత్రి 11 గంటల వరకు వీటిని కేటగిరీల వారీగా విభజించి పెట్టారు. ఇంకా కొన్ని కీలకమైన ఫైల్స్‌‌‌‌‌‌‌‌ మిస్‌‌‌‌‌‌‌‌ కావడంతో వాటిని బుధవారం తమకు అప్పగించాలని స్థానిక ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తమకు అవసరమైన ఫైల్స్‌‌‌‌‌‌‌‌ అన్నింటినీ మరోసారి తిరగేశారు. ఆ రోజు సాయంత్రం 5 అయినా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తాము కోరిన కీలకమైన ఫైల్స్‌‌‌‌ రాకపోవడంతో విజిలెన్స్‌‌‌‌ ఎస్పీ రమేశ్‌‌‌‌‌‌‌‌ స్థానిక ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఈ తిరుపతిరావును వెంట బెట్టుకొని నేరుగా బ్యారేజీ వద్దకు వెళ్లారు. తిరిగి 6 గంటలకు మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు కారులో కొన్ని ఫైల్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ బృందాలు పనిచేశాయి. మూడో రోజైన గురువారం ఉదయం 10.30కి.. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లకు సంబంధించి నిర్మాణ పనుల బిల్లులు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తయారు చేసిన ఫైల్స్‌‌‌‌‌‌‌‌ అన్నింటినీ ఏఈ, డీఈ, ఈఈల వారీగా విభజించి తెల్లటి గుడ్డలలో కట్టలు కట్టారు. ఈ కట్టలపై సంబంధిత ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్ల పేర్లు రాసిపెట్టారు. వీటిని ఓ బొలెరో వాహనంలో వేయగా.. వెహికల్‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌ కట్టలతో నిండిపోయింది.

అవసరమైన ఫైల్స్‌‌‌‌ తీసుకెళ్తున్నం

మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌, గ్రావిటీ కెనాల్‌‌‌‌కు సంబంధించిన భూసేకర ణ ఫైల్స్, ఎర్త్‌‌‌‌‌‌‌‌, మెటీరియల్ వర్క్స్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌ డేటాకు సంబంధించిన రికార్డులు సీజ్‌‌‌‌‌‌‌‌ చేశాం. వీటిని వివిధ అంశాల వారీగా విభజించి కట్టలు కట్టి ఒక వెహికల్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్తున్నాం. అక్కడ వాటిని పరిశీలిస్తాం. పనుల్లో అవకతవకలు, లోటుపాట్లు జరిగినట్లుగా తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.
‑ రమేశ్‌‌‌‌చారి‌‌‌‌, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ ఎస్పీ