ఆదిలాబాద్ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన తనిఖీలు

ఆదిలాబాద్ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన తనిఖీలు
  • హాస్పిటళ్ల తనిఖీలు ఆపేసిన్రు!
  • 'సర్కారు ఆర్డర్ తో నిలిపివేసిన దాడులు..
  • జిల్లాలో 77 హాస్పిటల్స్ తనిఖీ 34 హాస్పిటల్స్ కు నోటీసులు
  • నోటీసులు ఇచ్చిన వాటిపై ఇప్పటి వరకు చర్యలు లేవు 
  • ఆదిలాబాద్ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన తనిఖీలు

ఆదిలాబాద్, వెలుగు : వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మొదట్లో హడావుడిగా దాడులు చేసిన ఆఫీసర్లు నిబంధనలు పాటించని వాటికి నోటీసులు ఇచ్చారు. వారంలో సర్టిఫికెట్లు తీసుకోవాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ.. అవేవి కార్యరూపందాల్చలేదు. నెలరోజులవుతున్నా.. నోటీసులు ఇచ్చిన వాటిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతనెల 23న జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీలు చేపట్టారు. దాదాపు 77 హాస్పిటల్స్ విజిట్​ చేసి నిబంధనలు పాటించని 34 దవఖానలకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఎలా ఉన్నా.. చర్యలు తీసుకోలేదు. దీంతో ఆఫీసర్లు ఎందుకు తనిఖీ చేసినట్లు.. మళ్లీ ఎందుకు నిలిపివేసినట్లు అర్థంకాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.   

రాజకీయ ఒత్తిడితో..

తనిఖీల ప్రారంభంలో జిల్లాలో కొన్ని హాస్పిటళ్ల వైపు ఆఫీసర్లు చూడలేదు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా దాడులు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో ఆఫీసర్లు తనిఖీలు ఆపేసినట్లు విమర్శలు ఉన్నాయి. హాస్పిటల్స్ పై దాడులు ఆగిపోవడంపై ఆదిలాబాద్ డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్ వివరణ కోరేందుకు ‘వెలుగు ప్రతినిధి’ ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అడిషనల్ డీఎంహెచ్​వో సాధనను వివరణ కోరగా.. ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వాటికి నోటీసులు ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిలిపివేసినట్లు తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో 230 పైగా హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబులు ఉన్నాయి. దసరా ముందు వరకు అధికారులు 90 హాస్పిటళ్లను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు హాస్పిటళ్లను గుర్తించి నోటీసులు జారీ చేశారు. కానీ చర్యలు తీసుకోలేదు. నిర్మల్ జిల్లాలో దాదాపు 100కుపైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 10 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చారు. కానీ.. ఇంతవరకు ఏ హాస్పిటల్​పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలోనూ తనిఖీలు చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దాడులు ఆపేయాలని ఉత్తర్వులు

చాలా హాస్పిటల్స్, ల్యాబ్స్, మెడిక్సల్స్​ నిబంధనలు పాటించడం లేదు. రోగుల నుంచి వేల రూపాయలు బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దాడులు చేసిన ఆఫీసర్లు  పూర్తి స్థాయిలో వారిపై చర్యలకు వెనకడుగు వేశారు. తనిఖీల ప్రారంభం నుంచే ఆఫీసర్లు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. దసరా పండుగకు ముందు తనిఖీలు ఆపేయాలంటూ సర్కార్ నుంచి ఆర్డర్స్ రావడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు  ఎలాంటి తనిఖీలు చేపట్టవద్దని ఆదేశాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.