
ఇన్‌స్టా గ్రామ్ ద్వారా అమ్మాయిని ప్రేమించి నగలు కాజేసిన ప్రియుడిని సూర్యాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం పట్టణానికి చెందిన కర్రి సతీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్యాపేట తాళ్లగడ్డకు చెందిన బిక్షంరెడ్డి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న (మనువరాలు) యువతిని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానంటూ రెండు మూడు సార్లు సూర్యాపేట పట్టణంలో యువకుడు యువతిని కలిసి మాట్లాడేవాడు.
కొంతకాలం తర్వాత వ్యాపార అవసరాలకు, కారు కొనుగోలుకు కొంత డబ్బు కావాలని మాయమాటలు చెప్పి సదరు యువతి నమ్మించాడు. దీంతో యువతి తాత బిక్షంరెడ్డి ఇంట్లో ఉన్న 24తులాల బంగారాన్ని దొంగిలించి సతీష్‌కి ఇచ్చింది. బంగారం తిరిగి ఇవ్వాలని సతీష్‌ని అడగగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించడంతో ఆ యువతి విషయాన్ని తల్లికి, తాతకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు సతీష్ సెల్ ఫోన్ డేటా ద్వారా విచారించగా ఇంకొంత మంది యువతులను ఇలానే మోసం చేసినట్లు గుర్తించామన్నారు. సీఐ శివశంకర్ సిబ్బందితో కలిసి యానం వెళ్లి నిందితుడు సతీష్‌ని అరెస్టు చేసి బంగారం రికవరీ చేశామని ఆయన వెల్లడించారు.