వనపర్తి జిల్లాలో .. అందుబాటులోకి రాని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు

వనపర్తి జిల్లాలో .. అందుబాటులోకి రాని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు

వనపర్తి, వెలుగు: వినియోగదారులకు కూరగాయలు, మాంసం, చికెన్​, చేపలు, పండ్లు ఒకే చోట అందించడంతో పాటు వ్యాపారులంతా ఒకే చోట తమ వస్తువులు అమ్ముకునేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు అందుబాటులోకి రాలేదు. వనపర్తిలో పూర్తయినా ప్రారంభించకపోగా, మిగిలిన చోట పనులు పెండింగ్​లో ఉన్నాయి. వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణాలను రెండేండ్ల కింద ప్రారంభించారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే పాత అగ్రికల్చర్​ మార్కెట్​ యార్డులో నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ పనులు పూర్తి కాగా, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

రోడ్ల పక్కనే అమ్మకాలు..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కూరగాయలు, పండ్లు, నాజ్​వెజ్​ వ్యాపారులు రోడ్ల పక్కనే అమ్ముతున్నారు. ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు పూర్తయితే వారంతా ఒకే కాంప్లెక్స్​లో అమ్మకాలు చేసుకునే అవకాశం ఉంది. రోడ్ల పక్కనే కూరగాయలు, మాంసం, చేపలు అమ్ముతుండడంతో దుమ్ము, ధూళితో వ్యాపారులు ఇబ్బంది పడుతుండగా, వాటిని కొనేందుకు వెనకాడుతున్నారు. వర్షాకాలం, వేసవిలో ఇబ్బంది పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.

నిర్మాణాలు ఇలా...

  •  వనపర్తిలోని పాత అగ్రికల్చర్​ మార్కెట్​ యార్డులో రూ.19.50 కోట్లతో  నిర్మించిన మార్కెట్​ పూర్తయింది. చిరు వ్యాపారులకు షెడ్​లు కేటాయించడమే ఆలస్యం.  పట్టణం నడిబొడ్డున ఈ మార్కెట్​ ఉండడంతో వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 
  •  పెబ్బేరు పట్టణంలోని అగ్రికల్చర్​ మార్కెట్​ యార్డులో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. స్లాబ్​ లెవల్​ వరకు నిర్మాణం జరిగింది. 
  •   కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసి చేపట్టిన మార్కెట్​ పిల్లర్ల దశలోనే ఉన్నాయి.

వినియోగంలోకి తెస్తాం..

వనపర్తిలోని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణం పూర్తయింది. ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.

 పూర్ణచందర్, మున్సిపల్​  కమిషనర్